చంద్ర‌బాబు వ్యూహంలో మ‌రో కోణం.. ఏం జ‌రుగుతోంది…?

-

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రో వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్ర‌స్తుతం రాజ‌ధాని మార్పుపైనా, అమ రావ‌తిని రూపు రేఖ‌లు లేకుండా చేయాల‌నే ప్ర‌భుత్వ ఆలోచ‌న‌పైనా ఆయ‌న క‌దం తొక్కుతున్న విష‌యం తెలిసిందే. రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎట్టి ప‌రిస్థితిలోనూ కొన‌సాగించి తీరాల‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. ఆ దిశ‌గా త‌న‌కున్న అన్ని సామ‌దానభేద దండోపాయాల‌ను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న వ‌చ్చిన నాటి నుంచి కూడా చంద్ర‌బాబు కంటిపై కునుకు లేకుండా రాష్ట్రంలో ఉద్య‌మాల‌కు సిద్ధ‌మ‌య్యారు. ముందు రైతుల‌ను రంగంలోకి దింపారు. ఇది వ‌ర్క‌వుట్ కాలేదు.

దీంతో రాజ‌ధాని సెంటిమెంటును ర‌గిలించారు. అది కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో ఉపాది, పెట్టుబ‌డులు అంటూ కొత్త రాగం అందుకున్నారు. ఇది కూడా పూర్తిగా వ‌ర్క‌వుట్ అవ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మ‌హిళ‌ల‌ను రంగంలోకి దింపారు. ప్ర‌స్తుతం ఈ సెంటిమెంట్ న‌డుస్తోంది. అయినా కూడా చంద్ర‌బాబులో ఎక్క‌డో భ‌యం వెంటాడుతూనే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇన్ని చేసినా కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిగిరాక‌పోవ‌డం, రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగించే విష‌యంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌క‌పోగా.. మ‌రింత దూకుడు పెంచి హైప‌వ‌ర్ క‌మిటీలు నియ‌మించ‌డంతో చంద్ర‌బాబు మ‌రింత‌గా ఆందోళ‌న పెరిగింద‌న‌డంలో సందేహం లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జోలెప‌డుతున్నారు. ఎందుకు జోలె ప‌డుతున్నారు ? అంటే ఆయ‌న వ‌ద్ద స‌మాధానం లేదు. ఉద్య‌మానికిజోలె ప‌డుతున్నాన‌ని చెబుతున్నారు. ఇదేస‌మ‌యంలో మ‌రో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. యువ‌త‌ను, ముఖ్యంగా విద్యార్థుల‌ను రంగంలోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్య‌మాల‌కు శ్రీకారం చుట్టిన విద్యార్తి సంఘాలు ఎక్క‌డా ప‌రాజ‌యం అనేది ఎరుగ‌వు.

ఈ సెంటిమెంటును గుర్తించిన చంద్ర‌బాబు.. ఇప్పుడు రాజ‌ధాని ఉద్య‌మంలోకి యువ‌త విద్యార్తులు రావాల‌ని, తిని కూర్చుంటే ఫ‌లితం లేద‌ని, మీకు ఉద్యోగాలు రావ‌ని ఆయ‌న హిత‌వు ప‌లుకుతున్నారు. ఇంత‌వ‌ర‌కు మంచిదే అయినా.. ఇక్క‌డే కొంద‌రు గ‌తంలో చంద్ర‌బాబు ఎలా వ్య‌వ‌హ‌రించారు ? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మించిన విద్యార్థుల‌ను అణిచేయ‌లేదా ? త‌ల్లిదండ్రుల‌ను పోలీస్ స్టేష‌న్ల‌లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వ‌లేదా ? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి బాబు ఏం స‌మాధానం చెబుతారో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version