అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్షలో వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన ధర్మ పోరాట దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక హోదా కారణంతోనే ఎన్డీయే నుంచి బయటికి వచ్చినట్టుగా మాట్లాడారు. దాదాపు 10 కోట్ల రూపాయల ప్రభుత్వం ఖర్చుతో ధర్మ పోరాట దీక్షను చంద్రబాబు చేపట్టారు. ఆర్థిక సంఘం వల్లనే ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించానని చంద్రబాబు చెప్పారు. అయితే.. 14 వ అర్థిక సంఘం 2015 లో నివేదిక ఇస్తే.. ఎన్డీయే నుంచి మాత్రం టీడీపీ 2018 లో బయటికి వచ్చింది. 2015 నుంచి 2018 దాకా చంద్రబాబు ఏం చేసినట్టు.. అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఆయన మాట్లాడిన దాంట్లో మొత్తం ప్రత్యేక ప్యాకేజీని తాను ఎందుకు అంగీకరించారో.. తనను తాను సమర్థించుకునే పనిలో పడ్డాడు. దాన్ని 14 వ ఆర్థిక సంఘం మీదికి నెట్టడానికి ప్రయత్నించారు. తను యూటర్న్ తీసుకోలేదని.. కేంద్ర ప్రభుత్వమే యూటర్న్ తీసుకున్నదని చెప్పడానికి ప్రయత్నించారు. అంతే కాదు.. తనకు తాను శుద్ధపూస అని చెప్పుకోవడానికి తెగ ప్రయత్నించాడు. ఆ నేపథ్యంలోనే ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు.