ఏపీలో ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాక ముందు నుంచే ప్రజల్లో ఉండాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకున్నారాయన. వైసీపీ వాదాన్ని బలంగా జనాల్లోకి వ్యాప్తి చేయాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు. అందులో బాగంగా 25న భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
ఇందుకోసం వైసీపీ శ్రేణులు భీమిలిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీమంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈలోపు రాష్ర్టవ్యాప్తంగా అభ్యర్ధులను ఖరారు చేసే ప్రక్రియను జగన్మోహన్‌రెడ్డి పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చాక ఆయన పూర్తిగా జనాల్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రజాసంకల్ప యాత్ర తరహాలో కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు.
పొత్తుల విషయంలో ప్రతిపక్షాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నారు.దీంతో అభ్యర్ధుల ఎంపిక కూడా ఆ పార్టీలు ఇప్పటికీ చేపట్టలేదు.పొత్తుల్లో భాగంగా సీట్లు ఖరారు చేసుకొని అభ్యర్థులను ప్రకటించే నాటికి అసంతృప్త రాగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఈ పరిస్థితులు పూర్తిగా వైసీపీకి కలిసొస్తాయి.ఆ వివాదాలను చల్లార్చే పనిలో ప్రతిపక్షాలు బిజీ అవుతాయని అది తమకు బాగా కలిసి వస్తుందని వైసీపీ వర్గాలు అంటున్నారు.
ప్రత్యర్ధి పార్టీల నుంచి అభ్యర్ధుల జాబితా తయారవ్వక ముందే ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ ప్లాన్ చేసింది. ప్రతి ఇంటికి సంక్షేమం అందించామని దాన్నే జోరుగా ప్రచారం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇంటింటికీ నేతలు వెళ్లి గతానికి ఇప్పటికి తేడాను వివరించాలని ఇప్పటికే వైసీపీ శ్రేణులకు సీఎం ఆదేశించారు. వైనాట్ 175 నినాదంతో ఈ సారి బొమ్మ బ్లాక్ బస్టర్ కావాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలా పార్టీ నేతలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగే సమయంలోనే అన్ని జిల్లాలను చుట్టేయాలని సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు.
మొత్తం వంద సభల్లో పాల్గొనేలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌డ్డి ప్లాన్ చేశారు.ఇందు కోసం జనవరి 25న భీమిలిలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.అధికారిక కార్యక్రమాలు తగ్గించుకొని పూర్తిగా పార్టీపైనే ఫోకస్ పెట్టబోతున్నారు.ఓవైపు బహిరంగ సభల్లో పాల్గొంటూనే పార్టీకి అనుబంధంగా ఉండే సంఘాల నేతలతో ముచ్చటించేందుకు ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధమైంది.సర్పంచ్‌లు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు.రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా వ్యూహాన్ని రచిస్తున్నారు జగన్.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మరింతగా వేగం పెంచే ఆలోచనలో ఉన్నారు. ప్రతిపక్షాలు తీసుకొచ్చే మేనిఫెస్టుకు దీటుగా తాము అమలు పరిచిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అదే టైంలో మరో ఆకర్షణీయమైన ఎన్నికల హామీ పత్రం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్‌రెడ్డి జోరు చూస్తుంటే ప్రతిపక్షాలకు అవకాశం లేకుండాఈసారి 175 సీట్లు గెలిచేలా కనిపిస్తున్నారు.