.వైసీపీ పై పెరిగిన విపక్షాల మాటల దాడి
.గట్టి కౌంటర్ ఇచ్చేoదుకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు
. ఇంతకీ ఈ టీమ్ లో ఉన్నదేవరో తెలుసా
నాలుగేళ్లుగా ఏపీలో వైసీపీపై టీడీపీ,జనసేన మాత్రమే విమర్శలు చేస్తూ వస్తున్నాయి. అటు పరిపాలన అంశాలతో పాటు అవినీతి,అక్రమాలపై ఈ రెండు పార్టీల నేతలు వైసీపీని తిట్టిపోసేవారు. అప్పుడప్పుడు కాంగ్రెస్,సీపీఐ, సీపీఎం నేతలు కూడా విమర్శలు చేసేవారు. అయితే బీజేపీ నాయకులు వైసీపీ ని తిట్టినా అవినీతి ఆరోపణలు చేసిన అధికార పార్టీ నేతలు పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారింది. ఇటీవల విశాఖ వేదికగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోపణలు చేసింది మొదలు విపక్షాలన్నీ ఏకమై అధికార పార్టీపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాటి పరిణామాలు వైసీపీ ని ఇరుకున పడేస్తున్నాయి.విపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వకపోతే.. ప్రజల్లో వైసీపీ పట్ల అభిప్రాయం మారిపోతుందన్న భావనకి వైసీపీ వచ్చింది.అందుకే ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం లేకుండా ముందుకు సాగాలని సీఎం జగన్ నేతలకు సూచించినట్టు సమాచారం.
జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్నారు జగన్. ఎన్నికల సమయానికి ప్రతిపక్షాల మాటల దాడి పెరిగే అవకాశం ఉందని సీఎంతో పాటు పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టకపోతే అసలుకే మోసం వాటుందని డిసైడై పోయారు.అందుకే ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చేoదుకు పార్టీ పరంగా సీనియర్లు, వాగ్దాటి ఉన్న నేతలను ఎంపిక చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. జిల్లాల స్థాయిలోనే కాదు మరీ ముఖ్యంగా రాష్ట్రస్థాయిలో గట్టి కౌంటర్ అటాక్ ఇచ్చే విధంగా కొంత మంది నేతలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం.
సీఎం రూపొందించిన టీంలో రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డికి అగ్ర ప్రాధాన్యం లభించింది. మంత్రులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్, విడదల రజని,కాకానీ గోవర్ధన్ లకు అవకాశం దక్కింది. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ,అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరలు ఉన్నారు.ఇంకొంత మందికి ఈ టీం లో స్థానం కల్పించే దిశగా చర్చలు జఫుగుతున్నాయి. కౌంటర్ అటాక్ టీంలో ఉన్న వారంతా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సి ఉంటుంది.తరచుగా మీడియాతో టచ్ లో ఉండాలని ఈ బృందానికి సీఎం ఆదేశించారు.