హుజూరాబాద్ ఉపపోరులో అధికార టీఆర్ఎస్ తరుపున ఎవరు బరిలో ఉంటారు? హుజూరాబాద్‌లో కారుని నడిపించే నాయకుడు ఎవరు? అంటే ఇప్పుడే చెప్పడం కష్టం అని అర్ధమైపోతుంది. ఎందుకంటే ఇంతవరకు అక్కడ పార్టీ తరుపున అభ్యర్ధి ఇంకా ఖరారు కాలేదు. ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక హుజూరాబాద్ ‘కారు’ డ్రైవర్ ఎవరో తేలిపోతారని తెలుస్తోంది.
అయితే ఈలోపు చాలామంది నాయకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ బరిలో రెడ్డి వర్గానికి చెందిన నాయకుడుని నిలబెడితే పరిస్తితి ఎలా ఉంటుంది? లేదా బీసీ వర్గానికి చెందిన నాయకుడుని పెడితే ఎలా ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడుని నిలబెడితే ఎంతవరకు లబ్ది చేకూరుతుందే అనే కోణాల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్ధులని ఎంపిక చేసే పనిలో పడింది.
కాకపోతే దళితబంధు ఇస్తున్నారు కాబట్టి, దళితుల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఉండరని అర్ధమవుతుంది. ఎందుకంటే పథకం ద్వారా దళితుల ఓట్లు రాబట్టుకోవచ్చని చూస్తున్నారు. అలాగే హుజూరాబాద్‌లో కాస్త ఎక్కువగా ఉన్న రెడ్డి వర్గం నుంచి నాయకుడుని నిలబెడితే, కౌశిక్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? లేక కొత్తగా పార్టీలోకి వస్తున్న పెద్దిరెడ్డికి అవకాశం ఇస్తారా అనే అంశాలు తేలాల్సిఉంది.
కానీ ప్రస్తుతం ఉన్న పరిస్తితులని చూస్తే టీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్ధే బరిలో ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీసీలకు చెందిన పలువురు నాయకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇటీవల పార్టీలో చేరిన టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణనే హుజూరాబాద్ పోరులో నిలబెట్టాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. రమణ సామాజికవర్గానికి చెందిన పద్మశాలిల ఓట్లు హుజూరాబాద్‌లో బాగానే ఉన్నాయి. అలాగే మిగిలిన బీసీ వర్గాల ఓట్లు కూడా రమణకు పడతాయని అంటున్నారు. పైగా బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ని ఓడించాలంటే రమణనే కరెక్ట్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి చివరిగా హుజూరాబాద్ కారు సీటులో ఎవరు కూర్చుంటారో.