బీజేపీలో ఇప్పటి వరకు ఉన్న నేతలు సమిష్టి నిర్ణయాలకు కట్టుబడి ఉన్న విషయాలను మనం చూడొచ్చు. బీజేపీ తెలంగాణ మాజీ స్టేట్ చీఫ్ డాక్టర్ కె.లక్ష్మణ్ కానీ, అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి కానీ సమిష్టిగా పోరాటాలు చేసే వారు. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగేవారు. ప్రస్తుతం పరిస్థితులు అలా లేవనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రజెంట్ పార్టీ లైన్ దాటే వారు ఎక్కువైపోయారని చెప్తున్నారు కొందరు ఆ పార్టీ నేతలు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరూ పాటించేవారు.
అయితే, ప్రస్తుతం పరిస్థితులు వేరేలా ఉన్నాయట. ఈ క్రమంలోనే బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు చెక్ పెట్టేందుకుగాను మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఇప్పటికే పలు సభల్లో పాల్గొన్నారు బండి సంజయ్. దాంతో బండి సంజయ్, కిషన్‌రెడ్డి మధ్య విభేదాలు లేవనే వాదన బీజేపీ వర్గాలు చేశాయి. అయితే, ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరిట ‘బండి’ పాదయాత్ర షురూ చేసిన క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’ పేరిట పాదయాత్ర స్టార్ట్ చేశారు.
ఈ క్రమంలో తెలంగాణలో ‘బండి’తో సమానంగా తనకు ఇమేజ్ ఉండాలిని కిషన్ రెడ్డి ప్లాన్ చేశారనే చర్చ మళ్లీ మొదలైంది. మరో వైపు బీజేపీ కోర్ కమిటీ లీడర్ వివేక్ వెంకటస్వామి కూడా పాదయాత్రను చేపట్టారు. కాళేశ్వరం ముంపు బాధితులకు నష్టపరిహారం ఇప్పించేందుకు ఆయన పోరుయాత్రను ప్రారంభించారు. బీజేపీ మంచిర్యాల జిల్లా సెక్రెటరీ చేస్తున్న పాదయాత్రకు ఆయన సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి బీజేపీలో కూడా కాంగ్రెస్ పార్టీ లాగానే నేతలు ఎవరికి వారే పాదయాత్రల ‘పర్వం’ షురూ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.