మనోల్లాస కారకం సంగీతం : ధర్మాన

-

బాపూజీ కళామందిరం (శ్రీకాకుళం నగరం) : మనోల్లాస కారకం సంగీతం అని, నిత్యం ఒత్తిళ్లతో సతమతమయ్యే ఆధునిక జీవన విధానానికి శ్రావ్యమయిన సంగీతం దివ్యౌషధం అని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక బాపూజీ కళామందిరంలో శ్రీ సుమిత్రా కళా సమితి నేతృత్వాన ఏర్పాటు చేసిన వేణుగాన సంగీత విభావరికి ముఖ్య అతిథిగా విచ్చేసి,ఆత్మీయ వచనం అందించారు. ఇటువంటి మహోన్నత కార్యక్రమాల నిర్వహణకు పూనిక వహించిన శ్రీ సుమిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

భారతీయ సంగీతానికి ఉన్న సమున్నత రీతిని ఈ తరహా సంగీత విభావరులు చాటి చెబుతాయని అభిప్రాయపడ్డారు.ఇటువంటి కార్యక్రమాలు లేని నగరాలు నిర్జీవంతో కూడుకున్నవని,ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వేణు గాన సంగీత విభావరి నిర్వహణ చేయడం ఈ ప్రాంతానికే గర్వకారణం అని పేర్కొంటూ..ప్రదర్శనకు విచ్చేసిన కళాకారులకు శుభాకాంక్షలు అందించారు.

అనంతరం సంగీత విభావరిలో తమ స్వర లహరిని వినిపించేందుకు విచ్చేసిన సుప్రసిద్ధ కళాకారులు,హైద్రాబాద్ వాస్తవ్యులు అయిన జయ ప్రద రామ మూర్తి (ఫ్లూట్),బెనారస్ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ బీవీఎస్ ప్రసాద్ (మృదంగం)కు, అదేవిధంగా స్థానిక కళాకారులయిన మావుడూరు సత్యనారాయణ శర్మ (వయొలిన్)కు,మావుడూరు సూర్య ప్రసాద్ శర్మ (ఘటం)కు, బీవీఎస్ ప్రసాద్ (మృదంగం)కు నిర్వాహకుల తరఫున ఆత్మీయ సత్కారం అందించారు.

తొలుత ప్రదర్శించిన కుమారి రూపం రఘు వంశీ (బెనారస్ వర్శిటీ పరిశోధక విద్యార్థిని) భరత నాట్యాభినయం సభికులను అలరించింది.ఆమెను కూడా ధర్మాన సత్కరించి,  అభినందించారు. కార్యక్రమానికి శ్రీ సుమిత్ర సంస్థ తరఫున ఇప్పిలి శంకర శర్మ, గుత్తు చిన్నారావు,డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు,మండవిల్లి రవి తదితరులు నేతృత్వం వహించి,ఎమ్మెల్యే ధర్మానకు కృతజ్ఞతలు చెల్లించారు.సంగీత విభావరిలో శ్రీకాకుళం మున్సిపాల్టీ మాజీ చైర్ పర్సన్ పైడిశెట్టి జయంతి,నగరానికి చెందిన సంగీత అధ్యాపకులు సుసరాపు గణపతి శర్మతో సహా పలువురు సంగీత, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version