ప్రేమ కారణంగా మంచి ఫలితాలు వస్తాయి.. ప్రేమ కారణంగా మంచి రోజులు వస్తాయి. ముందున్న రోజులు జగనన్న ప్రేమ కారణంగా పూర్తిగా మారిపోయి రాష్ట్రాన్ని ప్రగతి దారుల నడిపిస్తాయి అని అనుకోవడంలో అవివేకం లేదు అప నమ్మకం అంత కన్నాలేదు. అప నమ్మకం ఉన్నా కూడా జగన్ అన్న ఎదుట చెప్పకూడదు. ఆయన ప్రేమ అందుకు అభ్యంతరాలు చెప్పి పోతుంది. అందుకనో ఎందుకనో ప్రేమ కారణంగానే మంచి లేదా చెడు లేదా అతి తో కూడిన మంచి లేదా అతితో కూడిన చెడు మన జీవితాల్లో అతిపాతం చెంది ఉంటాయి.
ఆ విధంగా ఉండడం వల్లే జగనన్న జనాలకు నచ్చుతున్నాడని ఓ టాక్. అవును! వచ్చేసారి కూడా ఈ ప్రేమ కారణంగానే ఆయన మరో సారి సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయం అని వైసీపీ వర్గాలు బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. అది వారి ప్రేమకు మరియు నమ్మకానికి సంబంధించిన విషయం.. అదే వారి వ్యక్తిగతం.. ప్రేమ వ్యక్తిగతం నుంచి సామాజికం వరకూ ఉంటుంది కనుక అన్న ప్రేమ ఎటు నుంచి ఎటు వెళ్తుందో అన్నది ఆసక్తికరం. అన్న అనగా జగనన్న అని అర్థం.. అర్థం చేసుకోరూ!
ఆంధ్రావని రాజకీయాల్లో జగన్ రూటే వేరు. ఆయన ఏమనుకున్నారో అదే చేస్తారు. ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా అవేవీ పట్టించుకోరు అన్న వాదన కూడా ఉంది. వాదన అనుకోండి.. అభిప్రాయం అనుకోండి.. ఏదయితేం ఏం ఆయన తీరులో అస్సలు మార్పే రాదు. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఓ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి. ఆ విధంగా ఆయన మన రాష్ట్ర ప్రజలకు మేలు చేశానని అనుకుంటున్నారు. మేలు చేశారో లేదో అన్నది తరువాత సంగతి! ఇప్పుడు ఆయన ప్రేమ అంతా కొత్త జిల్లాల ఏర్పాటుపైనే!
ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిపోవాలి. ఆ విధంగా ఆయన ప్రేమ తెలుగు సంవత్సరం నుంచి ప్రారంభం కావాలి. అక్కడి నుంచి ఆయన ప్రేమ ఎక్కడిదాకా అయినా వెళ్లాలి. ఆయన ప్రేమ కారణంగానే ప్రజలకు పథకాలు అందుతున్నాయి. ఆయన ప్రేమ కారణంగానే ప్రజలకు గుక్కెడు నీళ్లు దక్కుతున్నాయి.. పిడికెడు అన్నం కూడా ఆయన ప్రేమ కారణంగానే దొరుకుతుంది.
దీనిని ఎవ్వరూ కాదనం కానీ ఇప్పుడీయన ప్రేమ కారణంగా రెండున్నర లక్షల కోట్ల అప్పు కూడా కలిగింది. అంటే సంక్షేమం రీత్యా ఖర్చు పెట్టిన ఖర్చు. వీటికి అదనంగా కొత్త జిల్లాలపై ప్రకటించిన ప్రేమకు మరో 1500కోట్ల రూపాయలు కూడా అవసరం కానున్నాయి. అంత డబ్బు ప్రేమ పూర్వకంగా కేంద్రం ఇవ్వదు కనుక మనమే ప్రేమపూర్వకంగా ఎక్కడో ఓ దగ్గర అప్పు రూపంలో తనఖా రూపంలో తెచ్చుకోవాలి. అందుకు సీఆర్డీఏ భూములనో విశాఖ ఆస్తులనో అమ్ముకోవడమో తనఖా పెట్టుకోవడమో చేయాలి.