చంద్రబాబు అరెస్టుపై ఫైర్ అయిన బాలకృష్ణ ఇప్పుడు మెత్తబడ్డారా ? లేక సైడ్ చేసేశారా ? అనే అనుమానం టీడీపీలోని కొందరు ముఖ్యులతో పాటు నందమూరి అభిమానుల్లోనూ మొదలైంది. తాజా పరిణామాలను చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది కూడా. గత నాలుగైదు రోజుల నుంచి లోకేష్, పవన్ కళ్యాణ్ లే హైలెట్ అవుతున్నారు గానీ బాలయ్య మాత్రం తారస పడడం లేదు. చంద్రబాబుతో ములాఖత్ సమయంలోనూ బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత కూడా పవన్ కళ్యాణే ఫోకస్ అయ్యారు తప్ప, బాలయ్య మాత్రం కాలేకపోయారు. ములాఖత్ తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడే తప్ప, బాలకృష్ణకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తుంటే బాలయ్యను పక్కన పెట్టేశారనే అనుమానం సామాన్యుడికీ వస్తోంది.
నందమూరి కుటుంబంలో స్వర్గీయ ఎన్టీఆర్ నట వారసత్వానికైనా, రాజకీయ వారసత్వానికైనా బాలకృష్ణ పేరే ముందువరుసలో ఉంటుంది. రెండుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. హీరోగా బాలయ్య చరిష్మా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్యంటే మావాడే అనుకునే అభిమానులకు కొదవే లేదు. చంద్రబాబుకి వియ్యంకుడు. లోకేష్ కి మామయ్య. చంద్రబాబు అరెస్టుతో పొలిటికల్ తెర మీద సీరియస్ గా కనిపించిన బాలయ్య.. ఇప్పుడు సైలెంట్ అయినట్లు కనిపిస్తున్నారు. ఈ సైలెన్స్ వెనక మర్మమేంటి ?
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తర్వాత టీడీపీ సీనియర్ నేతలు వరుసగా సమావేశం అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే భవిష్యత్ కార్యాచరణపై బాలయ్య సెంట్రల్ ఆఫీసుకి చేరుకుని, చంద్రబాబు కుర్చీలో కూర్చుని మరీ మీటింగ్ పెట్టేశారు. భవిష్యత్తు ప్రణాళికపై వారితో చర్చించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, గృహనిర్బంధాలు, పార్టీ నేతల టార్గెట్‌గా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలిపై ఆందోళనలు చేపట్టాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
పార్లమెంటు, నియోజకవర్గ స్థాయిల్లో కూడా కార్యక్రమాలకు సిద్ధం కావాలని నేతలకు ఆదేశించారు. బహుశా ఇదే బాలయ్యను సైడ్ చేసేందుకు కారణమై ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. యువగళం పాదయాత్రతో కాస్తోకూస్తో లోకేష్ ఇప్పుడిప్పుడే పొలిటికల్ గా రాణిస్తున్నారు. ఈ సమయంలో లోకేష్ పొలిటికల్ ఫోకస్ కి బాలయ్య ద్వారా బ్రేక్ పడుతుందనేది ఓ అభిప్రాయం. బాలయ్య సీన్ లోకి ఎంటరైతే.. ఇప్పటివరకు లోకేష్ పై జనాలకు ఉన్న ఎటెన్షన్ డైవర్ట్ అవడం ఖాయం.
అదీగాక చంద్రబాబు అరెస్టుతో అలెర్ట్ అయిన బాలకృష్ణ రంగంలోకి దిగి అన్నిట్లో ముందుంటూ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీ సీనియర్లతో భవిష్యత్ కార్యాచరణపై చర్చలు కూడా జరిపారు. ఇవన్నీ లోకేష్ కంటే బాలయ్యనే హైలెట్ చేస్తూ వచ్చాయి. ఇది కూడా రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు, పార్టీలోని కొందరు సీనియర్లకు రుచించలేదని, బాలయ్యను పక్కన పెడితే తప్ప, లోకేష్ కి పొలిటికల్ మైలేజీ పెరగదని భావించే సైడ్ చేస్తున్నారని సమాచారం. బాబుతో జైలులో ములాఖత్ తర్వాత కూడా పవన్ ఒక్కడే ప్రెస్ మీట్ లో మాట్లాడారే తప్ప, బాలయ్యతో ఒక్కమాట కూడా మాట్లాడించలేదు. అంటే చంద్రబాబు తర్వాత టీడీపీలో ఫోకస్ కావాల్సింది లోకేష్ బాబే కానీ బాలకృష్ణ కాదు. ఇదే చంద్రబాబు రాజకీయ వ్యూహమని పరిశీలకులు చెబుతున్న మాట.