ఉమ్మడి కూటమిలో టికెట్ల చిచ్చు…

-

తెలుగుదేశం పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరుతుంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు 34 మందితో రెండో లిస్ట్ విడుదల చేశారు. పొత్తుల్లో భాగంగా కీలకమైన స్థానాలను మిత్రపక్షాలకు వదిలేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పసుపు దండు.. ఓవైపు అగ్గి పుట్టిస్తుండగా.. మరోవైపు సీట్లు దక్కని సీనియర్లు భవిష్యత్తు వ్యూహాలతో పార్టీకి డేంజర్ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఈ లిస్టులో టికెట్ దక్కని ఆశావహులు ఆందోళనకు దిగుతున్నారు. పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ నేతలు, వారి అనుచరులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. మరికొందరు నేతలు చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు.

ఎన్నడూ లేనట్లు టీడీపీ చరిత్రలోనే తొలిసారి ఎన్నికల షెడ్యూల్ ముందే అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. పొత్తులు, సీట్ల సర్దుబాటు అన్నీ కొలిక్కి తెచ్చేశారు. పోటీ చేద్దామనుకున్న 144 సీట్లలో 128 అభ్యర్థుల పేర్లను ముందే ప్రకటించడం ఓ రికార్డు కాగా.. ఇంకా బ్యాలెన్స్ ఉన్న 16 సీట్లే అధినేతకు తలనొప్పిగా మారాయి.
ఈ 16 సీట్లలో చంద్రబాబు లెక్క ఒకటైతే అక్కడ స్థానిక లీడర్లు ఇంకో లెక్కలు వేస్తుండటం చంద్రబాబుకు చికాకుగా మారింది.

తొలి, మలి జాబితాలో సీట్లు దక్కని సీనియర్లు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం, వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని సీనియర్ నేతలైన కళావెంకట్రావు, గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహిళా నేత గౌతు శిరీషకు టికెట్ ప్రకటించలేదు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీటుపై కొంత ఊగిసలాట నడుస్తుండగా.. ఎలాగైనా భీమిలిలో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన జనసేన నుంచి భీమిలి టికెట్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గంటా పోటీపై చంద్రబాబు పట్టిన పట్టు వీడటం లేదని తెలుస్తోంది. అయితే చీపురుపల్లి లేదంటే పార్టీకి సేవ చేయాలని చంద్రబాబు తెగేసి చెబుతుండటంతో.. గంటా ప్రత్యామ్నాయం వెతుకున్నట్లు తెలుస్తోంది.

ఇక మరో సీనియర్‌ నేత కళా వెంకటరావుతోపాటు ఆయన సోదరుడి కుమారుడైన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున టికెట్‌పైనా హైడ్రామా కొనసాగుతోంది. ఎచ్చెర్ల టికెట్‌ను కళా ఆశిస్తుండగా, స్థానికంగా ఆయనకు పార్టీలో తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో విజయనగరం ఎంపీగా పోటీ చేయమని పార్టీ ప్రతిపాదిస్తుండటంతో తర్జనభర్జన పడుతున్నారు కళా వెంకటరావు. గత రెండు రోజులుగా సన్నిహితులతో చర్చిస్తున్న కళా.. ఎచ్చెర్ల సీటు కోసం అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు.

ఈ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు సీట్లు ఆశిస్తుండగా, వారికి పోటీగా కొత్తగా పార్టీలో చేరిన వారు, ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామిక వేత్తలు రంగంలోకి దిగి టికెట్లు తన్నుకుపోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఒత్తిళ్ల మధ్య 16 స్థానాలను పెండింగ్‌లో పెట్టిన అధినేత చంద్రబాబు.. చివరికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది

Read more RELATED
Recommended to you

Exit mobile version