ఇప్పటి వరకు ఆదిరించిన నియోజకవర్గాన్ని కుమారుడికి అప్పగించి సొంత జిల్లా పై దృష్టిపెడుతున్నారట మాజీ మంత్రి బాబుమోహన్. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈ మాజీ మంత్రి.. భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆందోల్ వైపు కన్నెత్తి చూడకపోయినా ఈ మధ్య యాత్రం చాలా యాక్టివ్ అయినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆయన శిబిరం నుంచి వస్తున్న లీకులు చర్చకు దారితీస్తున్నాయి.
బాబూ మోహన్ సినిమాలలో నటిస్తూనే టీడీపీలో చేరి రాజకీయ అరంగ్రేటం చేశారు. బాబూమోహన్ ఎంత వేగంగా రాజకీయాల్లోకి వచ్చారో అంతే వేగంగా మంత్రి అయ్యారు. టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. అదే పార్టీ నుంచి రెండుసార్లు ఓడిపోయారు. 2014లో టీఆర్ఎస్లో చేరి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరి పోటీ చేసినా అదృష్టం కలిసి రాలేదు. బీజేపీలో రాష్ట్రస్థాయి నేతగా ఉన్నందున పార్టీ కూడా అలాగే తన సేవలను ఉపయోగించుకుంటుందని కేడర్‌కు చెబుతున్నారట బాబూమోహన్.
వచ్చే ఎన్నికల నాటికి ఉండే పరిస్థితులు.. పార్టీ పెద్దల ఆదేశాల మేరకు నడుచుకుందామని చెబుతూనే తన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఆందోల్ నుంచి పోటీ చేస్తారని వెల్లడిస్తున్నారట. అలాగే తాను ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని చెబుతున్నారట బాబూమోహన్. ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు తప్ప చెప్పుకోదగ్గ నేతలు బీజేపీలో లేరని అందుకే తాను సత్తుపల్లి వెళ్తున్నట్టు కేడర్ కి ఉప్పందిస్తున్నారు. ముఖ్యంగా కుమారుడిని రాజకీయ అరంగ్రేటం చేయించే ప్లాన్‌లో ఉన్నారట. అమిత్‌షా సహా ఇతర పార్టీ పెద్దలకు ఇప్పటికే తనయుడిని పరిచయం చేశారు బాబుమోహన్.
సత్తుపల్లి నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఖమ్మం జిల్లా అంతా ఉంటుందని అలాగే అక్కడి టీడీపీ కేడర్ నుంచి తనకు మంచి సంబంధాలు ఉన్నాయని బాబూమోహన్ చెబుతున్నట్టు తెలుస్తోంది. తాను సత్తుపల్లి వెళ్తే వారంతా బీజేపీ కండువా కప్పుకొంటారని, ఏపీకి సరిహద్దు జిల్లా కావడంతో మరింత అడ్వాంటేజ్ అవుతుందని కూడా లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో బాబూమోహన్ సేవలను బీజేపీ బాగానే ఉపయోగించుకుంది. అప్పటి నుంచి ఆయన గేమ్ ప్లాన్ మార్చినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ మాజీ మంత్రి ఫ్యూచర్ ప్లాన్ పై బీజేపీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.