రసవత్తరంగా గన్నవరం రాజకీయం

-

కృష్ణాజిల్లాలోని గన్నవరం రాజకీయం రసవత్తరంగా మారింది.2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ చేఇలో ఓడిపోయారు. ఆ తరువాత కొంత కాలానికి వంశీ వైసీపీ గూటికి చేరుకున్నారు. వంశీ వైసీపీలోకి రావడానికి ఇద్దరు మంత్రులు కీలక పాత్ర పోషించారు.ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యార్లగడ్డ యాక్టివ్‌ కావడంతో ఇక్కడ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇదే క్రమంలో తన కార్యకర్తలు,అనుచరులతో యార్లగడ్డ వెంకట్రావ్‌ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఓ రకంగా బలప్రదర్శనకు నిదర్శనమని వైసీపీలోని ఓ వర్గం నేతలు చెప్పుకుంటున్నారు.

అవకాశం వచ్చినప్పుడల్లా వంశీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వెంకట్రావ్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలోనూ తన విమర్శలతో గన్నవరం రాజకీయంలో వేడిని రగిల్చారు. తనను ఓడించిన వ్యక్తితో సంధి అవసరం ఏంటని ప్రశ్నిస్తూ…,వంశీ వైసీపీలో చేరే సమయంలో సీఎం జగన్‌ కానీ,దుట్టా రామచంద్రరావు కానీ తనతో మాట్లాడలేదని వెంకట్రావ్‌ అన్నారు. వంశీతో కలిసి పనిచేయాలని, ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం చెప్పినా తాను తిరస్కరించానని గుర్తు చేశారు.ఏది ఏమైనా 2024లో గన్నవరం నుంచి పోటీ చేయడం ఖాయమని కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారు. విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని కొందరు సూచించినా తాను గన్నవరం నియోజకవర్గాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేసినట్లు కార్యకర్తలకు చెప్పారు. రెండేళ్ళ నుంచి సీఎం జగన్‌ను కలవాలని ప్రయత్నాలు చేస్తున్నా అపాయింట్‌మెంట్‌ దొరకలేదని కార్యకర్తల వద్ద వాపోయారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ గతంలో కార్యకర్తలపై పెట్టిన కేసులు ఇంతవరకు మాఫీ కాలేదని యార్లగడ్డ తెలిపారు.పార్టీ కోసం పనిచేసిన వాళ్లను నిర్లక్ష్యం చేయోద్దని సీఎంకి చాలాసార్లు చెప్పినట్లు గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు గన్నవరం టిక్కెట్‌ ఇవ్వాలని ఆత్మీయ సమ్మేళనం వేదికగా సీఎం జగన్‌ను యార్లగడ్డ అభ్యర్ధించారు. టిక్కెట్‌ ఇవ్వకపోతే ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని కుండబద్ధలు కొట్టారు. ఎన్నిసార్లయినా గన్నవరం నుంఏ పోటీ చేస్తానని చెప్పిన యార్లగడ్డ ఎట్టి పరిస్థితుల్లో వల్లభనేని వంశీతో కలిసి ప్రయాణం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version