వైసీపీలో సంచ‌ల‌నం.. స‌గం మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. ఎస‌రు పెడ‌తారా..!

-

ఏంటి.. నిజ‌మా? అని బుగ్గ‌లు నొక్కుకుంటున్నారా? మీరు చ‌దివింది నిజ‌మే! నిన్న మొన్న‌టి వ‌ర‌కు అన్న‌.. జ‌గ‌న‌న్న‌.. అన్న నోళ్లే.. వ‌ద్ద‌న్న‌.. మాకు నువ్వొద్ద‌న్న‌! అనే వ్యాఖ్య‌లు ప‌లుకుతున్నాయి! ఇలా ఒక‌రు కాదు.. ఇద్ద‌రుకాదు.. దాదాపు 60-80 మంది ఎమ్మెల్యేలు ఇలానే ఉన్నారు. ఎవ‌రిని క‌దిలించినా.. మేం అధికారంలోకి రాక‌పోయి ఉంటేనే బాగుండేది- అనే మాటే వినిపిస్తోంది. చిత్రం ఏంటంటే.. ఇలా అనేవారంతా.. జ‌గ‌న్ కోసం.. జ‌నాల మ‌ధ్య ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకున్న‌వారే. ఆయ‌న సీఎం కావాల‌ని ఆకాంక్షించిన వారే. ఆయ‌న సీఎం అయ్యాక‌.. వీరికి ఎలాంటి ప్రాధాన్యం లేక‌పోయినా మ‌రి ఎందుకు అంత‌గా.. విసిగిపోయారు? ఇదే ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

వాస్త‌వానికి ప‌ద‌వులు ద‌క్క‌క‌పోతే.. ఇలా అంటున్నారులే అని అనుకోవ‌చ్చు. కానీ, జ‌గ‌న్ ప‌ద‌వులు ఇచ్చినా ఇవ్వ‌కున్నా.. ప్ర‌భుత్వం ఉంటే చాల‌నుకునేవారే ఇప్పుడు ఇలా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. రెండు ప్ర‌ధాన కార‌ణాలు వారిని ప‌ట్టిపీకుతున్నాయ‌ని అంటున్నారు. “మాకు ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోయినా.. ఫ‌ర్వాలేదు.. మా పార్టీ అధికారంలో ఉంటే చాల‌నుకున్నాం. కానీ, ఇప్పుడు పార్టీ హ‌ద్దులు దాటిపోతోంది. ఎప్పుడు ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. ప్ర‌స్తుతం పెను తుఫాను ముంద‌టి ప్ర‌శాంత‌త‌గా రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. న్యాయ వ్య‌వ‌స్థ తీరు ఉంద‌ని మేం అనుకుంటున్నాం. ఎంద‌రో రాజ‌కీయ దిగ్గ‌జాలున్యాయ వ్య‌వ‌స్థతో పెట్టుకుని ఏమ‌య్యారో మాకు తెలుసు. ఇప్పుడు మా నేత ప‌రిస్థితి త‌లుచుకుంటే.. ఏం చెప్తాం!!“ అనేవారు పెరుగుతున్నారు.

అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌పై ఉన్న‌కేసుల విచార‌ణ రోజువారీగా ప్రారంభ‌మైంది. దీంతో ఆయ‌న‌ను ఏక్ష‌ణానైనా అరె్స్టు చేయొచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప‌రిణామాల‌కు తోడు అమ‌రావ‌తి వివాదం ఇంకా ర‌గులుతూనే ఉంది. దీనిని ఎటూ తేల్చ‌లేక‌పోతు న్నార‌ని నేత‌లు అంటున్నారు.అవినీతి విష‌యంలో నేత‌ల‌పైనే కాదు.. పార్టీపైనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తోనే దాదాపు సగం మంది నేత‌లు పార్టీకి షాక్ ఇస్తారా? మేం నిజాయితీగా ఉన్నాం! అని చాటుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా ? త‌మ భవిష్య‌త్తును ప‌దిలం చేసుకునే క్ర‌మంలో అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔన‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

ఏ క్ష‌ణాన ఏమైనా జ‌ర‌గొచ్చ‌నే ప్ర‌చారం ఊపందుకుంది. అంటే.. అది జ‌గ‌న్ విష‌యంలోనా? లేక పార్టీ నేత‌ల విష‌యంలోనా? అనేది మాత్రం గుంభ‌నంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. రెడ్డి వ‌ర్గంలోనే తిరుగుబాటు వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం కూడా గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version