జ‌గ‌న్ నిర‌స‌న‌కు ఇండి కూట‌మి పార్టీల‌ క్యూ.. వ్యూహం ఫ‌లించిన‌ట్టేనా

-

ప‌క్కా వ్యూహంతో ఒక ప‌ని మొద‌లు పెడితే ఫ‌లితాలు ఏవిధంగా ఉంటాయో ఢిల్లీలో జ‌గ‌న్ చేప‌ట్టిన నిర‌స‌న‌ధ‌ర్నాను చూస్తే అర్ధ‌మౌతుంది. ఏపీలో జ‌రుగుతున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై ధ్వ‌జ‌మెత్తుతూ ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్టారు వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. మూడురోజుల పాటు ఈ నిర‌స‌న‌లు కొన‌సాగ‌నున్నాయి. ఈ క్ర‌మంలో తొలిరోజు ఆయ‌న చేసిన నిర‌స‌న‌కు మ‌ద్ధ‌తుగా నిలిచారు ఇండి కూట‌మి పార్టీలనేత‌లు. ప‌లువురు ప్ర‌ముఖులు క్యూక‌ట్టి మ‌రీ జ‌గ‌న్‌కు మ‌ద్ధ‌తుగా నిలిచారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అండతో వైసీపీ కార్యకర్తలు, నాయకుల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. వీటిపై రాష్ట్రంలోనే ఉంటూ నిన్న మొన్నటివరకూ విమర్శలు గుప్పించిన వైసీపీ ఢిల్లీ వేదికగా నిరసనకు దిగి ఎన్డీఏ కూట‌మి సాగిస్తున్న అరాచ‌కాల‌పై గ‌ళాన్ని వినిపించింది.

తాను చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌కు ప‌లు పార్టీను ఆహ్వానించారు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి.ఇన్నాళ్ళూ మోడీతో ఉన్న జ‌గ‌న్‌కు ఇప్పుడు మిగ‌తా రాజ‌కీయ పార్టీలు మ‌ద్ద‌తు ఇస్తాయా అనే అనుమానాలు కొన‌సాగాయి.అయితే ఆ అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ ఇండి కూట‌మి పార్టీ నేత‌లు జ‌గ‌న్‌కు మ‌ద్ధ‌తుగా నిలుస్తున్నారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్, శివసేన(యూబీటీ) ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, ఐయూఎంఎల్ ప్రతినిధులు అబ్దుల్ వాహబ్, హ్యారిస్, ఎఐఎడిఎంకే రాజ్యసభ ఎంపీ చంద్రశేఖర్‌ వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు. దీంతో వైసీపీ నేత‌లు సంతోషంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఎన్డీయే, ఇండీ కూటమికి దూరంగా ఉన్న వైసీపీకి ఇండీ కూటమి నుంచి ఈ స్ధాయిలో మద్దతు రావ‌డాన్ని ఊహించ‌లేక‌పోతున్నామ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

ఢిల్లీలో జ‌గ‌న్ చేప‌ట్టిన నిర‌స‌న‌లో చోటు చేసుకున్న పరిణామాలు రెండు సంకేతాలను ఇచ్చాయి. తాజాగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకే ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన డిమాండ్‌తో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్నట్లు సంకేతం ఇచ్చిన‌ట్లైంది. డిప్యూటీ స్పీకర్ పోస్టును విపక్షాలకే ఇవ్వాలంటూ వైసీపీ చేసిన డిమాండ్ ప్రభావంతోనే ఇవాళ ఇండీ కూటమి పార్టీలు జగన్ ధర్నాకు హాజరై మద్దతు తెలిపినట్లు సమాచారం. అయితే ఇండీ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ మాత్రం ఈ ధర్నాకు దూరంగా ఉండిపోయింది. మ‌రో రెండు రోజుల పాటు ఈ నిర‌స‌న‌లు కొన‌సాగ‌నున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత‌లు కూడా వ‌చ్చి మ‌ద్ధ‌తు ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నేష‌న‌ల్ మీడియా చెప్తోంది. మొత్తానికి జ‌గ‌న్ మామూలోడు కాద‌య్యా అని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version