తెలంగాణలో బిజేపి పొజిషన్ ఏంటి? ఆ పార్టీ మునుపటిలా దూకుడుగా ఉంటుందా? ఎన్నికల బరిలో సత్తా చాటగలదా? అంటే ప్రస్తుత పరిస్తితుల్లో అలాంటిదేమీ కనిపించడం లేదు. మొన్నటివరకు తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ పార్టీకి బిజేపినే ప్రత్యామ్నాయం అన్నట్లు కనిపించింది. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆ పార్టీలో జరిగిన మార్పులు..రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన మార్పుల నేపథ్యంలో ఒక్కసారిగా బిజేపి వెనుకబడింది.
ఆ పార్టీ ఇప్పటికీ పుంజుకోలేని పరిస్తితిలో ఉంది. వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే తెలంగాణలో బిజేపికి అనుకున్న మేర బలం లేదు. ఏదో నాలుగైదు సీట్లలో గెలిచే సత్తా..ఓ 10 సీట్లలో ఎక్కువ ఓట్లు తెచ్చుకునే బలం మాత్రమే ఉంది. కానీ దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచి ఒక్కసారిగా రేసులోకి దూసుకొచ్చింది. అటు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సత్తా చాటడం బాగా కలిసొచ్చింది. అప్పుడు అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ కూడా దూకుడుగా పనిచేసేవారు. దాంతో బిజేపి తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా రాజకీయం నడిపేది. అలాంటి పార్టీ ఇప్పుడు కొన్ని మార్పులతో వెనుకబడింది.
కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాక బిజేపిలో దూకుడు తగ్గింది. కీలక నేతలు యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో కేంద్ర మంత్రి అమిత్ షా రావడం…ఖమ్మంలో భారీ సభ జరిగిన నేపథ్యంలో బిజేపిలో కాస్త జోష్ కనిపిస్తుంది. వాస్తవానికి మునుపటి సభలు మాదిరిగా ఖమ్మం సభ అనుకున్న మేర హైలైట్ కాలేదు.
అయితే భారీగానే జనాలని తరలించారు. అమిత్ షాతో ఎన్నికల శంఖారావం పూరించారు. షా సైతం..కేసిఆర్ , కాంగ్రెస్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. కానీ రైతుగోస- బీజేపీ భరోసా సభలో రైతు సమస్యలకు పరిష్కారం చూపే దిశగా డిక్లరేషన్ ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రచారం చేయగా.. షా ప్రసంగంలో మాత్రం ఆ ప్రస్తావన రాలేదు.
అయితే అమిత్ షా..బీఆర్‌ఎస్, మజ్లిస్ మధ్య దోస్తీని క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగట్టాలని ప్రధానంగా సూచించారు. అంటే మతం ఆధారంగానే ఓట్లు రాబట్టాలని బిజేపి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి బిజేపి ఏ స్థాయిలో తెలంగాణలో రాణిస్తుందో.