చిన్న విషయం జరిగితే దాన్ని పెద్దగా ఊహించుకోవడం రాజకీయాల్లో సాధారణంగానే జరిగే ప్రక్రియ. అలాంటి రాజకీయానికి ఏపీలో కొదవ లేదు. మామూలుగానే కల్పిత కథనాలు చాలా వస్తాయి. అలాంటిది సిఎం జగన్, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఒకే వేదికలో పక్క పక్కన కూర్చుకుంటే చాలానే కథనాలు వస్తాయి. అయితే మొదట రాజకీయాలకు దూరంగా ఉంటూ..కేవలం ప్రభుత్వాల పాలనలోని మంచి, చెడుల గురించి మాట్లాడుతూ.. విలువైన రాజకీయాలు చేయాలని చెప్పే..జేపి ఇప్పుడు వైసీపీకి దగ్గరవుతున్నారనే టాక్ వస్తుంది.
అవినీతి లేని ప్రభుత్వాలు..ఓటుని నోటుతో కోనే రాజకీయాలు ఉండకూడదని రాజకీయాల్లోకి వచ్చి లోక్‌సత్తా పార్టీ పెట్టిన జేపి..2009లో పార్టీ ఓడిపోయిన తాను మాత్రం కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇక 2014లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నిదానంగా రాజకీయాలకు దూరమై..ఒక అనలిస్టుగా మిగిలిపోయారు. అలాంటిది ఆయన తాజా విజయవాడలో ఓ సభలో సిఎం జగన్‌తో వేదిక పంచుకున్నారు. జగన్ పక్కనే జేపి కూడా కూర్చున్నారు. ఇక జయప్రకాశ్ నారాయణ మాటలను జగన్ ఆసక్తిగా వినడం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అయితే గతంలో జేపి వైసీపీపై విమర్శలు చేశారు. అలాగే జగన్ పాలనని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. విద్య, వైద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని జేపి అభినందించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని అప్పట్లో జేపీ ప్రశంసించారు.
ఇక ఇప్పుడు జగన్‌ని కలవడంతో..వచ్చే ఎన్నికల్లో జేపి..వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారని, అది కూడా విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది. ఎలాగో జేపిది కృష్ణా జిల్లా..పైగా కమ్మ వర్గం. దీంతో విజయవాడలో టిడిపికి చెక్ పెట్టడానికి వైసీపీ నుంచి జేపిని బరిలో దింపుతారని టాక్. అయితే ఇందులో నిజం ఏమి లేదు. ప్రస్తుతానికి జేపి వైసీపీలోకి ఎంట్రీ పై చర్చ కూడా జరగలేదని తెలిసింది. కానీ ఎన్నికల సమయంలో ఏదైనా జరగొచ్చు.