అసెంబ్లీ రద్దు..ట్విస్ట్‌లు ఇస్తారా?

-

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని ముందుగానే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బి‌జే‌పి నేతలు ముందస్తు ఎన్నికలు వస్తాయని రెడీగా ఉండాలని తమ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ ముందస్తు ఎన్నికలు ఉండవని ఈ సారి పూర్తి కాలం ప్రభుత్వం నడుపుతామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని బి‌ఆర్‌ఎస్ నేతలు చెప్పుకొస్తున్నారు.

కానీ ఎన్ని చెప్పినా బి‌ఆర్‌ఎస్ వ్యూహాలు అర్ధం కాకుండా ఉన్నాయి. ముందస్తు ఎన్నికలు లేవని చెబుతూనే..సడన్ గా ముందస్తుకు వెళ్ళే అవకాశాలు లేకపోలేదని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతలు ముందస్తు ఎన్నికలపై ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ముందస్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు కాబోతుందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని, తాను కోదాడ నుంచి 50 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీలో ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

ఇక ఉత్తమ్ వ్యాఖ్యలకు బి‌ఆర్‌ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని,  ఆయన తనకు తానుగా ఏదేదో ఊహించుకొని బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని,  శాసనసభను రద్దు చేసేది లేదంటూ ముఖ్యమంత్రే పలు సందర్భాల్లో స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. అంటే ముందస్తు లేదని బి‌ఆర్‌ఎస్ నేతలు అంటున్నారు.

కానీ వారి మాటలు నమ్మడానికి లేదనే చెప్పాలి..ఇప్పటికే బడ్జెట్ సమావేశాల తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంతర్గతంగా సమాచారం వస్తుంది. కర్ణాటక ఎన్నికలతో పాటే తెలంగాణ ఎన్నికలు నిర్వహించడానికి కే‌సి‌ఆర్ రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ముందస్తు ఉంటుందో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version