మొండోళ్లకే మొండోడు….సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన రాజకీయ జీవితం మొదలయినప్పటి నుంచి తరచు వింటున్న మాట ఇది. ఏదైనా అనుకుంటే సాధించే మనస్తత్వం ఆయనది.తండ్రి బాటలో నడుస్తూ మడమ తిప్పని నైజం అతనిది.ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన పనితనంతో సమాధానం ఇస్తారు. భిన్నమైన ఆలోచనలతో తన మార్క్ పాలన చూపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని కొన్ని స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెడుతున్నారు.ఈ క్రమంలో ఆయన తీసుకునే నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ఎవరూ ఊహించని అభ్యర్థులును ఖరారు చేసి ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గoకి ప్రత్యేక స్థానం ఉంది.ఇక్కడి నుంచి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు, తోట గోపాలకృష్ణ, రెబల్‌స్టార్ కృష్ణంరాజు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం,తోట నరసింహం వంటి నేతలు ఇప్పటివరకు ఎంపీలుగా గెలుపొందారు.ఈసారి కాకినాడ పార్లమెంట్ బరిలో సీఎం జగన్ నిలబెట్టిన అభ్యర్థిని చూస్తే వైసీపీ పెద్ద సాహసమే చేస్తోంది.ఇప్పటివరకు మూడు సార్లు కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీచేసినా ప్రతీసారి ఓటమి చెందారు. వైసీపీ అభ్యర్ధిగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు చలమలశెట్టి సునీల్. ఈసారైనా ఆయన గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే సునీల్ ఖచ్చితంగా గెలుస్తారని అంటున్నారు సీఎం జగన్.
మూడు పార్టీలు….మూడు ఓటములు… చలమలశెట్టి సునీల్ పొలిటికల్ కెరీర్ ఇది.2009లో తొలిసారిగా కాకినాడ పార్లమెంటు స్థానానికి ప్రజారాజ్యం పార్టీ తరపున బరిలో దిగగా చలమలశెట్టి సునీల్‌పై కాంగ్రెస్ అభ్యర్ధి మంగపతి పల్లంరాజు 34,044 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో వైఎస్సార్‌సీపీ తీర్ధం పుచ్చుకున్న సునీల్ వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలిచారు.ఆయనపై టీడీపీ తరపున పోటీచేసిన తోట నరసింహారావు గెలుపొందారు. 2019లో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న చలమలశెట్టి సునీల్ మూడోసారి కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే మళ్లీ ఆయన ఓటమిని చవిచూశారు.మళ్లీ వైసీపీలో చేరిన సునీల్ ని సీఎం జగన్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఈనేపథ్యంలో నాలుగోసారి పార్లమెంటు అభ్యర్ధిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న చలమలశెట్టి సునీల్‌కు ఈసారైనా గెలుపు వరిస్తుందా అనేది వేచి చూడాలి.ఈసారి మాత్రం సునీల్ గెలుస్తాడని సీఎం జగన్ ధీమా వ్యక్తంచేస్తున్నారు.