రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న విమర్శలు అన్ని కావు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన అర్హతలు, ప్రధాన ఆకర్షణ, బలమైన సామాజిక వర్గం, సినీ గ్లామర్ ఇలా ఎన్నో అంశాలు పవన్ కు కలిసి వచ్చేవే. రాజకీయం గా వాటిని ఉపయోగించుకుంటూ, పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన పవన్ రాజకీయంగా ఇప్పటికీ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. పెద్దగా రాజకీయ అనుభవం లేకపోవడం, సరైన వ్యూహరచన కొరవడటం, పార్టీలో బలమైన నాయకుల కొరత, ఇలా ఎన్నో లోటుపాట్లు జనసేన లో నెలకొన్నాయి. బిజెపి అండదండలు ఉంటే, ఇవే మీ అవసరం లేదని, ఆ పార్టీ సహకారంతో సులువుగా అధికారంలోకి రావచ్చని, నమ్మి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ మొదటి నుంచి బిజెపి వైఖరి జనసేన విషయంలో అనుమానాస్పదంగానే ఉంటూ వస్తోంది. బీజేపీతో తమకు పొత్తు ఉండదని జనసేన గొప్పగా చెప్పుకుంటున్నా, బిజెపి మాత్రం ఎక్కడా అంశాన్ని హైలెట్ చేసుకోవడం లేదు.
ఈ నేపథ్యంలోనే బిజెపి కి దూరంగా జరిగేందుకు జనసేన సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు జనసేన ను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. బీజేపీతొ పవన్ తెగదెంపులు చేసుకుంటే, టిడిపి జనసేన కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు వెళితే, అధికారం దక్కించుకోవడం అంత కష్టమేమీ కాదు అనేది చంద్రబాబు లాజిక్. అందుకే 2024 లోపు పవన్ తమ దారిలోకి వస్తే తమకు అధికారం దక్కినట్టే అని టిడిపి ఆశలు పెంచుకుంటోంది.