ఏపీ రాజకీయాల్లో బీజేపీ,జనసేనకు మధ్య పొత్తు ఉన్నప్పటికి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగానే తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నాయి ఈ రెండు పార్టీలు. అయితే పంచాయతీ ఎన్నికల వేళ పార్టీల పనితీరు అంచనా వేస్తే బేజేపీ కంటే జనసేన పార్టీయే మెరుగైన ఫలితాలు సాధించిందట..ఇప్పుడిదే రెండు పార్టీల మధ్య రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఉనికి చాటుకుంది. పశ్చిమలోని 5 నియోజకవర్గాల్లో పలు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగరేశారు. పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఆచంటలలో.. పలు పంచాయతీలను జనసేన కైవసం చేసుకుంది. తూర్పులో కాకినాడ రూరల్ , పెద్దాపురం, జగ్గంపేట..రాజమండ్రి రూరల్, కొత్తపేట, రామచంద్రపురం, రాజనగరం, తణుకు నిడదవోలులో సత్తా చాటింది.
కృష్ణా జిల్లాలో మూడో దశకొచ్చాక పుంజుకున్న జనసేన అవనిగడ్డ, పెడన, మచిలీపట్నంలో సీట్లు సాధించింది. తెనాలి డివిజన్‌లోనూ మంచి సీట్లు గెలిచింది. కడపలోని రైల్వే కోడూరుతో పాటు ఒకటి రెండు చోట్ల ప్రభావం చూపింది. మొత్తంగా 300 సర్పంచ్‌లు వచ్చాయని జనసేన అంచనా వేస్తోంది. ఈ ఫలితాలు చూశాక బీజేపీ కంటే జనసేనే బెటర్ అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఈ ఎన్నికల్లో బీజేపీతో జనసేనకు సర్దుబాటు చేసుకోకపోయినా అక్కడక్కడ టీడీపీతో దోస్తీ కట్టింది. అయినా.. అనుకున్న దానికంటే మంచి ఫలితాలు సాధించింది. ఈ ఎన్నికల్లో ఎక్కడా బీజేపీ ఊసే కనిపించలేదు. అసలు ఆ పార్టీ అధిష్టానం పట్టించుకోనే లేదు. బీజేపీకి రాష్ట్రం మొత్తమ్మీద పట్టుమని 10 పంచాయతీలు కూడా దక్కలేదు. అయితే, ముందు నుంచీ దృష్టి పెట్టక పోయినా గ్రామాల్లో సత్తా చాటింది జనసేన. ఈస్ట్, వెస్ట్‌లలో జెండా ఎగరేసింది. పలు వార్డుల్లోనూ విజయం సాధించింది.