హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటి నుంచే సన్నద్దమవుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న నేపధ్యంలో లోక్ సభ అభ్యర్ధుల జాబితాను ప్రకటించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్నికల నగరా మోగకముందే లిస్ట్ రెడీ చేయాలని కసరత్తు మొదలుపెట్టింది. మినీ జమిలి ఎన్నికలు జనవరిలో జరగచ్చనే ఊహాగానాల నేపధ్యంలో బీజేపీ ముందుగానే రంగంలోకి దిగింది. దీంతో బీజేపీ లోక్ సభ అభ్యర్ధుల తొలి జాబితాపై ఆసక్తి రేగుతోంది.
తొలుత దేశవ్యాప్తంగా 160 నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించాలనే ఉద్దేశంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలోనే తెలంగాణలోని 12 లోక్ సభ నియోజకవర్గాలున్నట్లు సమాచారం. ఇటీవలికాలంలో తెలంగాణలో బీజేపీ కాస్త పుంజుకుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిలో ఉన్న బండి సంజయ్ దూకుడుగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపించారు. అయితే రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆ పదవి ఇప్పుడు కిషన్ రెడ్డి చేతిలోకి వెళ్ళింది. దీంతో ఇప్పుడు బీజేపీ తెలంగాణలో కాస్త ఆటుఇటుగా ఉంది. బీఆర్ఎస్ ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలిజాబితాలో అసంతృప్తులు కాంగ్రెస్ వైపు మళ్ళుతున్నట్లుగా ఉంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కూడా నెమ్మదిగా బలం పుంజుకుంటోంది. అయితే కాషాయ దళం కూడా తెలంగాణలో జెండా పాతాలని ఆది నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది. కిషన్ రెడ్డి నాయకత్వంపై కేంద్రంలోని పెద్దలకు గట్టి నమ్మకం ఉడడం కూడా ఇందుకు కారణం.
ఇక బీజేపీ ప్రకటించే లోక్ సభ అభ్యర్ధుల తొలి జాబితాలో 12 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నట్లు ప్రాధమిక సమాచారం. తొలుత ఈ అభ్యర్ధుల పేర్లను త్వరలో ప్రకటించే అవకాశముంది. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టి, తర్వాత పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై కమలం ఫోకస్ చేయనుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాకముందే.. తమ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆ కోవలోనే లోక్‌సభ ఎన్నికలకు కూడా ముందస్తు అభ్యర్థుల ప్రకటన వ్యూహాన్ని అమలు చేయాలని కమలనాధులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలోనూ త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాకముందే లోక్ సభ అభ్యర్ధుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశముంది.