అక్కడ గెలుపెవరిదో… ఆ పార్టీదే అధికారం..!

-

రాజకీయాల్లో సెంటిమెంట్‌ది అగ్రస్థానం. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు కూడా ముహుర్తం చూసుకునే అడుగు ముందుకు వేస్తాడు. ఏమైనా తేడా వస్తే రాజకీయ భవిష్యత్తుకే బ్రేక్ పడుతుందని భయం కూడా. అందుకే నామినేషన్ దాఖలు అయినా, ప్రచారం ప్రారంభించడానికైనా, ఓటు వేయడానికైనా, చివరికి కౌంటింగ్ సెంటర్‌కు వెళ్లాలన్నా సరే.. ఘడియలు చూసుకునే అడుగు ముందుకు వేస్తారు. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు పార్టీలకు అధికార, ప్రతిపక్ష హోదాను కట్టబెడతాయనేది కూడా అంతే నిజం. అవును… ఆ నియోజకవర్గంలో గెలిస్తే… పార్టీ అధికారంలోకి వస్తుందని… ఓడిన పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అవుతుందనేది గట్టి నమ్మకం. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం.

ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున మంత్రి అంబటి రాంబాబు పోటీ చేస్తుండగా… తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పోటీ పడుతున్నారు. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఇద్దరిదీ గుంటూరు జిల్లానే అయినప్పటికీ… స్థానికేతరులే. రాష్ట్రంలోనే సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న కన్నా గుంటూరు నుంచి రాగా… అంబటి రేపల్లె నియోజకవర్గానికి చెందిన నేత. దీంతో ఈసారి ఈ నియోజకవర్గం ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

వాస్తవానికి 1955 నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం ఓటరు తీర్పు ఏ పార్టీ వైపు ఉంటే.. ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. తొలి నాళ్లల్లో కాంగ్రెస్ లేదా ఆ పార్టీ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రమే గెలిచారు. అయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 1983 నుంచి అక్కడ పోటీ తారాస్థాయికి చేరుకుంది. 1983లో తొలిసారి నన్నపనేని రాజకుమారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. ఆ తర్వాత 1985లో పొత్తులో భాగంగా సత్తెనపల్లి నుంచి సీపీఎం అభ్యర్థి పోటీ చేసి గెలిచారు.

ఈ రెండు ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1989లో కాంగ్రెస్ అభ్యర్థి బాలకోటిరెడ్డి గెలవడంతో… మళ్లీ అధికారం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లింది. 1994, 1999 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి సీపీఎం, టీడీపీ అభ్యర్ఖులు గెలిచారు. ఆ రెండు సార్లు కూడా రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. ఇక 2004, 2009లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వెంకటేశ్వర్రెడ్డి గెలిచారు. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారం.

రాష్ట్ర విభజన తర్వాత 2014లో సత్తెనపల్లి నుంచి ఇద్దరు స్థానికేతరులు పోటీ చేశారు. టీడీపీ తరఫున దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోటీ చేయగా… వైసీపీ తరఫున ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు పోటీ చేసి ఓడిపోయారు. అంబటి ఓటమితో వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక 2019 ఎన్నికల్లో మరోసారి ఈ ఇద్దరు నేతలే తలపడగా… ఈసారి సత్తెనపల్లి ఓటరు తీర్పు అంబటిని గెలిపించింది. దీంతో వైసీపీ కూడా అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం అందరి చూపు సత్తెనపల్లి వైపు ఉంది. సత్తెనపల్లిలో ఎవరు గెలిస్తే… ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది రాజకీయ పార్టీలో బలమైన విశ్వాసం. అందుకే అక్కడ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరి ఈసారి సత్తెనపల్లి ఓటరు కన్నాను గెలిపిస్తాడా… లేక మూడోసారి పోటీ చేస్తున్న అంబటి వైపు మొగ్గు చూపుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version