తెలంగాణలో దళిత బంధు ప్రవేశపెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో దళిత బంధుపై విపక్షాలు తమదైన రీతిలో స్పందిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా దళిత బంధుపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ గతంలో దళితులకు ఇచ్చిన హామీలను గుర్తూ చేస్తూ విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ కనీసం వారికి ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. అలానే దళితులకు 3 ఎకారాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి… కేవలం తప్పించుకోవడం కోసం ఇవ్వడానికి భూమి లేదని ప్రకటించారని విమర్శించారు. రాష్ట్రంలో ఎంతో భూమి ఉందని… అవసరం ఉంటే నష్టపరిహారం చెల్లించి కూడా భూమి కొనుగోలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని జీవన్ రెడ్డి గుర్తు చేసారు.
ఇక తెలంగాణలోని శాసన సభ్యుల సంఖ్య ప్రకారం 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలకు 3 మంత్రి పదవులు రావాలని కానీ కేవలం ఒకే మంత్రి పదవి ఇచ్చి వారికి అన్యాయం చేసారని జీవన్ రెడ్డి అన్నారు. దళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఎన్నికలకు వెళ్తానని కేసీఆర్ ప్రతిజ్ఞ చేయాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి డిమాండ్ చేసారు.