మ‌ధుయాష్కీకి ఏఐసీసీలో కీల‌క ప‌ద‌వి…..! అంతా రేవంత్ చెప్పిన‌ట్టుగానే

-

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన‌ట్లుగానే కాంగ్రెస్ అధిష్టానం న‌డుచుకుంటున్న‌ట్లుంది.పీసీసీ చీఫ్‌ నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించి త‌న‌కు న‌మ్మ‌క‌స్తుడైన మహేష్ కుమార్ గౌడ్ కి సార‌థ్య బాధ్య‌త‌లు ఇప్పించారు. ఎవరైతే పార్టీని సమన్వయం చేయగలరు అని చేప‌ట్టిన అభిప్రాయ సేకరణ అనంతరం అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా దీనివెనుక రేవంత్ సిఫార‌సు బ‌లంగా ఉంద‌నే టాక్ న‌డుస్తోంది. ఈ విషయంలో సీనియర్ల ప్రతిపాదనను పార్టీ పెద్దలు పక్కన పెట్టినట్టు సమాచారం.

సీఎం రేవంత్‌ రెడ్డి మొదటి నుంచి ప్రతిపాదించిన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టు ఢిల్లీ వర్గాల టాక్‌. టీపీసీసీ ఎంపిక విషయంలో తొలి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మహేష్‌ కుమార్‌ వైపే నిలుచున్నారు. ఒకవేళ ఆయన్ను కాదంటే బలరాం నాయక్‌కు ఇవ్వాలని ప్రతిపాధించినట్టు టాక్‌. అయితే ముఖ్యమంత్రి సూచించిన విధంగా మహేశ్‌ కుమార్‌కే టీపీసీసీ బాధ్యతలు అప్పగించడంతో సీఎం రేవంత్ అధిష్టానం దగ్గర తన పంతం నెగ్గించుకున్న‌ట్ల‌యింది.

పీసీసీ చీఫ్ విష‌యంలో సీఎం రేవంత్‌ తో పాటు.. మిగతా మంత్రులు,పార్టీ సీనియ‌ర్‌లు చాలాసార్లు ఢిల్లీకి వెళ్లి అభిప్రాయాలను పార్టీ పెద్దలకు వినిపించారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని అధిష్టానం కోరగా.. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్ర‌తిపాదించారు.ఒక‌వేళ ఎస్టీలకు ఇవ్వాలని భావిస్తే ఎంపీ బలరాం నాయక్ పేరును అధిష్టానం వ‌ద్ద ఉంచారు రేవంత్‌. అయితే, ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని పలువురు సీనియర్ నేతలు మాత్రం అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కీ గౌడ్ పేరును ప్రతిపాదించార‌ట‌.

సీనియర్ నేత మధుయాష్కీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతారని.. మహేష్ కుమార్ గౌడ్ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది.రేవంత్ పీసీసీ పగ్గాలు చేపటిన మొదట్లో..సీనియర్ , రేవంత్ వర్గం నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగిన సమయంలో.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ పార్టీని సమన్వయం చేయడం ఆయనకు తాజాగా కలిసి వచ్చిన అంశంగా చెబుతున్నారు.

చాలా రోజులుగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించారు.ఇక‌ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు క‌దుపుతోంది.పీసీసీ పీఠం ఆశించి భంగ‌ప‌డిన సీనియ‌ర్‌లు కేబినెట్‌లో అయినా స్థానం దొరుకుతుందా అని ఆశ‌ప‌డుతున్నారు.ఈ మేర‌కు ఏఐసీసీకి విజ్ఞ‌ప్తులు చేసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిల తర్వాత నాల్గో పీసీసీ ఛీప్ గా నియమితులయ్యారు మహేష్ కుమార్ గౌడ్.అయితే మొద‌టి నుంచి టీపీసీసీ రేసులో ఉన్నారు మధుయాష్కీ గౌడ్‌.

ఇక్క‌డ ఆయ‌న్ను నిరాశ‌ప‌రిచిన అధిష్టానం ఆయ‌న‌కు మరో పదవి ఇచ్చేందుకు సిద్ధ‌మైంద‌ని గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి. మధుయాష్కీ గౌడ్‌కు ఏఐసీసీలో పెద్ద పదవి రాబోతుందంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని స‌మాచారం. మొత్తంగా పీసీపీ చీఫ్‌గా మహేష్ కుమార్‌ గౌడ్‌ పేరును ప్రకటించడంతో.. మంత్రివర్గంలో ప్లేస్‌ కోసం మరికొందరు నేతలు లాబీయింగ్‌ మొదలు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్ పార్టీ ఏ అంశాన్ని కూడా ఒక ప‌ట్టాన తెంచ‌దు కాబ‌ట్టి కేబినెట్ విస్త‌ర‌ణ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version