బిఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రుణమాఫీ విషయంలో హరీష్ రావు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని తెలిపారు. రైతులు రుణ విముక్తి పొందుతుంటే హరీష్ రావుకు కన్నీరు ఆగడం లేదని సెటైర్లు వేశారు ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ నేతలు రుణమాఫీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. రుణమాఫీ విషయంలో హరీష్ రావు కుట్రలు ఫలించవని అన్నారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని.. మొత్తం 31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పేదలకు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని హరీష్ రావు ని ప్రశ్నించారు. ఇక మరోవైపు హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలు రైతులను ఆత్మహత్యలకు పురుగోల్పే విధంగా ఉన్నాయని.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కోరారు.