కిషన్‌రెడ్డి కొత్త టీమ్‌….పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యం

-

 

గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి ఎనిమిది సీట్లు వచ్చాయి. జనసేన పొత్తుతో బరిలోకి దిగిన బీజేపీ గతంలో కంటే ఎక్కువశాతం ఓట్లను కొల్లగొట్టి 8 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులను గెలిపించుకుంది.ఇదే జోష్‌ ను పార్లమెంటు ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని చూస్తోంది.అవసరమైతే మార్పులు చేర్పులు చేసి కొత్త టీమ్‌ని దింపే ఆలోచనలో ఉంది బీజేపీ హైకమాండ్‌. లోక్‌సభలో 400 సీట్లు సాధించడమే టార్గెట్‌గా పెట్టుకుంది.ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల ముందు తెలంగాణ కాషాయసైన్యంలో సంస్థాగత ప్రక్షాళనపర్వానికి రంగం సిద్ధమైంది. ఇందులో అంతా కిషన్‌రెడ్డి మార్క్‌ కనిపించనుంది. నూతన సంవత్సరంలో కొత్త టీమ్‌ను సిద్ధం చేస్తున్నారు బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి.పనిచేయని వారిపై మీద వేటు వేయడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. కొత్త ఏడాది ఏర్పాటు చేయనున్న నూతన కమిటీలోని నాయకులకు కొత్త టార్గెట్‌ ఇవ్వబోతున్నారాయన. తెలంగాణలోని 15 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించి పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా కేడర్‌లో జోష్‌ నింపనున్నారు. ఈ మార్పులతో బీజేపీకి బలం టానిక్‌ లభిస్తుందని అంచనాలు వస్తున్నాయి.

తెలంగాణ రాష్ర్టంలో 15 జిల్లాలకు పార్టీ కొత్త అధ్యక్షులను మార్చడం దాదాపు ఖాయమైంది.ఇదే విషయాన్ని కేంద్రమంత్రి,ప్రస్తుతం బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యమని ఇప్పటికే కేడర్‌కు ఆదేశాలిచ్చేశారు.15 జిల్లాలకు కొత్త కెప్టెన్లు రాబోతున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మార్పులకు రెండు ప్రాతిపదికలు ఉన్నాయి. ఆరోపణలు వచ్చినవారిని, సరిగా పనిచేయని వారిని పక్కనబెట్టడంతో పాటు దీర్ఘకాలంగా అధ్యక్షులుగా కొనసాగుతున్నవారికి ఆ పదవుల నుంచి ఉద్వాసన పలకడం గ్యారంటీ అంటున్నారు పార్టీ శ్రేణులు. రాష్ట్ర పదాధికారుల్లోనూ మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఈ మార్పుల కోసం కిషన్‌రెడ్డి కసరత్తులు చేస్తున్నారు.

మొన్న అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చి వెళ్ళిన తరువాత కొత్త టీమ్‌ల కూర్పు ప్రక్రియ జోరందుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పది సీట్లు సాధించాలని తెలంగాణ కేడర్‌కు లక్ష్యాన్ని నిర్దేశించారు అమిత్‌ షా. ఈ టార్గెట్‌ను సాధ్యం చేయాలంటే కొత్త టీమ్‌ కావాలి. అందుకే కిషన్‌రెడ్డి ముమ్మర కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులతో కిషన్‌రెడ్డి చర్చలు జరిపారు.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి భరతం పట్టడంపై కూడా కిషన్‌రెడ్డి ఫోకస్‌ చేశారు. వారిపై వచ్చిన ఫిర్యాదులపై బీజేపీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. నేడో రేపో వాళ్ళకు కమిటీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.మొత్తానికి కొత్త సంవత్సరం కిషన్‌రెడ్డి కొత్త టీమ్‌లతో అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version