రాష్ట్ర రాజకీయాలను శాసించే సామాజికవర్గాల్లో కమ్మ వర్గం కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే. ఈ కమ్మ వర్గం ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాలని ఎక్కువగానే ప్రభావితం చేస్తుంది. ఈ జిల్లాలో కమ్మ వర్గం ప్రభావం ఉన్న స్థానాలు బాగానే ఉన్నాయి. అటు టిడిపి, ఇటు వైసీపీ నుంచి పోటీ చేసే కమ్మ నేతలు ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఏ ఏ నియోజకవర్గాల నుండి అధికార. ప్రతిపక్ష పార్టీలు పోటీకి నిలబెట్టేది ఎవరినో, ఈసారి విజయం సాధించే వారెవరు, అసలు ఆ నియోజకవర్గాలు ఏంటో తెలుసుకుందాం.
అధికార వైసీపీ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గాలలో గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం, విజయవాడ తూర్పు, మైలవరం, పెనమలూరు స్థానాల్లో టిడిపి నుంచి కమ్మ అభ్యర్ధులు బరిలో ఉండటం ఖాయం. వైసీపీ నుంచి ఒక్క పెనమలూరు మినహా మిగిలిన అన్నీ స్థానాల్లో కమ్మ నేతలనే బరిలో పెడుతుంది.
@ గుడివాడ నియోజకవర్గం నుంచి వైసీపీ కొడాలిని నిలబెడితే, టిడిపి కొడాలి నాని పై పోటీగా రావి వెంకటేశ్వరరావు గాని ,వెనిగండ్ల రాముని గాని నిలబెట్టే అవకాశాలున్నాయి. వీరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. 2019 ఎన్నికలలో టిడిపి కొడాలి నాని పై దేవినేని అవినాష్ ను పోటీగా నిలబెట్టింది. అప్పుడు రావి వెంకటేశ్వరరావు తన పూర్తి మద్దతును అవినాష్ కు ఇచ్చారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా గుడివాడలో కొడాలి నానినే గెలిచారు. కానీ ఈసారి రావి వెంకటేశ్వరరావుకు, వెనిగండ్ల రాముకు మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. వీరిద్దరూ కలిస్తే గుడివాడలో ఈసారి టిడిపి గెలిచి సంచలనం సృష్టిస్తుంది, కానీ వీరిద్దరి మధ్య వైరం పెరిగి వర్గ పోరు ఏర్పడితే మళ్లీ అది కొడాలి నానికే ప్రయోజనం కలిగిస్తుంది. నియోజకవర్గంలో కొడాలి నాని పై వ్యతిరేకత ఉన్న వాటిని టిడిపి ఓట్లుగా మార్చుకుంటుందో లేదో చూడాల్సిందే.
@ గన్నవరం నుండి ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది రాష్ట్రం మొత్తం ఆసక్తికరంగా గన్నవరం నియోజకవర్గ వైపే చూస్తోంది. వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీని వైసిపి బరిలోకి దించితే, వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. అంగబలం ,అర్ధబలం ఎక్కువగా ఉన్న వంశీ పై గన్నవరంలో యార్లగడ్డ గెలుపు కష్టమే అని సొంత పార్టీ నాయకులే అంటున్నారు. 2019లో వంశీ పై ఓడిపోయిన యార్లగడ్డ ఈసారైనా ప్రజాభిమానంతో గెలుస్తారో లేదో వేచి చూడాల్సిందే.
@ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి వైసీపీ దేవినేని అవినాష్ పేరును ప్రకటించగా, టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను బరిలోకి దించుతుంది. టిడిపి నుండి వైసీపీలోకి వెళ్లిన అవినాష్ తూర్పు విజయవాడ నియోజకవర్గంలో తనదంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అటు గద్దెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ హోరాహోరీ తప్పదు.
@మైలవరంలో వర్గ పోరు ఎక్కువే.. అది అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా గొడవలకు మైలవరం పెట్టింది పేరు. వైసిపి నుండి సిట్టింగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మళ్ళీ పోటీ చేసే ఛాన్స్ ఉంది. టిడిపి నుంచి దేవినేని ఉమా ఫిక్స్. దేవినేని ఉమాకు టిడిపిలో పట్టు తగ్గిందని వార్తలు వినిపిస్తున్నాయి. వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధి కన్నా గొడవలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉన్నా ,ఈ వర్గపోరుతో గజిబిజిగా ఉన్న మైలవరం నియోజకవర్గాన్ని ఓటర్లు ఎవరికీ సొంతం చేస్తారో వేచి చూడాలి.
@ పెనమలూరు నుండి టిడిపి బోడే ప్రసాద్ ను బరిలో దించుతుంది. వైసీపీ మాత్రం బిసి నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారధి పోటీ చేయవచ్చు. రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలలో పెనమలూరు ఒకటి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన పెనమలూరు నియోజకవర్గం టిడిపి కంచుకోట అని చెప్పవచ్చు. 2014లో టిడిపి తరఫున పోటీ చేసిన బోడే ప్రసాద్ వైసీపీ అభ్యర్థి విద్యాసాగర్ పై 30 వేల పైచిలుకు ఓట్లతో మెజారిటీ సాధించారు. కానీ 2019లో జగన్ ప్రభంజనంలో వైసీపీ అభ్యర్థి పార్థసారథి, బోడే ప్రసాద్ పై గెలుపును సాధించారు. పార్థసారథి నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. 2014లో అధికారంలో ఉండగా బోడే ప్రసాద్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈసారి టిడిపికి పట్టం కడతాయని రాజకీయ విశ్లేషకుల అంచనాలు చెబుతున్నాయి.ఎటు చూసినా ఈసారి పెనమలూరు టిడిపి సొంతమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.