భారత్-చైనా సరిహద్దులో గల గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల ఘర్షణలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానంలో సంతోష్ బాబు భౌతికకాయాన్ని హకీంపేట విమానాశ్రయానికి తీసుకుని వచ్చారు ఆర్మీ అధికారులు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, జగదీశ్, గవర్నర్ తమిళిసై మరియు పోలీస్ ఉన్నతాధికారులు హకీంపేట విమానాశ్రయంలో కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి నివాళి అర్పించారు.
అలాగే సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. కాగా కాసేపట్లో సంతోష్‌బాబు పార్థివదేహాన్ని సూర్యాపేటకు తరలించనున్నారు. రేపు ఉదయం 7.45 గంటలకు సంతోష్ బాబు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. సంతోష్‌కు నివాళ అర్పించేందుకు వచ్చే వారు కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట వద్ద ఉన్న కేసారంలోని వ్యవసాయ భూమిలో సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.