తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ఏదైనా ఉందా అంటే కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నిక అనే చెప్పాలి. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికార పార్టీని వీడినప్పటి నుంచి హుజూరాబాద్ మీద టీఆర్ ఎస్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఎలాగైనా రాజేందర్ మీద గెలిచేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఎన్నికలను పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదని మొదటి నుంచి కేటీఆర్ చెప్తున్నా కూడా తమ పనులు మొత్తం హుజూరాబాద్ ను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు.
ఇక్కడే ఇప్పటికే ఈ ఒక్క ఉప ఎన్నిక కోసం గత చరిత్రలో ఏనాడు లేని విధంగా ఏకంగా దళిత బంధు లాంటి స్కీమ్ ను పెట్టేశారంటే కేసీఆర్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. ఈ నియోజకవర్గ డెవలప్ మెంట్ కోసం ఇప్పటికే వందల కోట్లు కుమ్మరిస్తున్నారు.కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు. అన్ని మండలాల నుంచి బలమైన లీడర్లను ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు.
మండలానికో మంత్రిని పెట్టి మరీ ప్రచారాలు నిర్వహిస్తున్న టైమ్‌లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. టీఆర్ ఎస్ పార్టీని నడిపిస్తున్న కేటీఆర్ హుజూరాబాద్ లో ఓడిపోయినంత మాత్రాన రాష్ట్రంలో తమ పార్టీ ఏం అధికారం కోల్పోదంటూ సంచలన కామెంట్లు చేశారు. అదేంటి ఇంత చేస్తున్నా కూడా కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆయన పార్టీ నేతలు అంతా కూడా షాక్ అవుతున్నారనే చెప్పాలి. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే ఓడిపోతామనే భయం స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ అప్పుడే ప్రచారం మొదలు పెట్టేసింది.