రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ కీలక నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. సుదీర్ఘ కాలంగా టీడీపీ నేతలు చక్రం తిప్పిన ఈ నియోజకవర్గంలో గత ఏడాది వైసీపీ తరఫున విజయం దక్కించుకున్నారు ఓ మహిళా నాయకురాలు. ఆమెపై చాలా అంచనాలు.. ఆశలతో వైసీపీ అధినేత జగన్ టికెట్ ఇచ్చారు. అంతేకాదు.. తాను ఇవ్వాలని అనుకున్న విషయాన్ని కూడా జగన్ బహిరంగంగా వెల్లడించి.. మాట తప్పకుండా టికెట్ ఇచ్చారు. ఎన్నికలకు కొన్నాళ్లకు ముందు.. రాజకీయ కక్షల నేపథ్యంలో సదరు మహిళా నేత కుటుంబ పెద్దను కోల్పోయారు.
కొన్నాళ్లు పరిస్థితి బాగున్నా.. తర్వాత మాత్రం పరిస్థితి దారుణంగా తయారైంది. సదరు మహిళా ఎమ్మెల్యే కుటుంబం ఇక్కడ చక్రం తిప్పడం ప్రారంభించింది. ముఖ్యంగా కుమారుడు, అల్లుడు కూడా తమదే అధికారం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కాంట్రాక్టులు, సెటిల్ మెంట్లు, భూ ఆక్రమణల్లోనూ వారి పేరు జోరుగా వినిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ నాయకులను పట్టించుకోవడం లేదు. కేడర్‌ను చాలా దూరం పెట్టారు. పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. సదరు మహిళా నేత ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మరీ ఆమెను గెలిపించిన వారందరిని ఆమె పుత్రరత్నం, బంధుగణం పక్కన పెట్టేశారు.
నియోజకవర్గంలో మండలాలను ఆమె పుత్రరత్నం, బంధువులు వంతుల వారీగా పంచుకుని మరీ దోచుకుంటున్నారన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే ఉన్నాయి. ఈ పరిణామాలతో సదరు మహిళా ఎమ్మెల్యే పేరుకేనని.. అక్కడ మంచి పేరున్న కుటుంబాన్ని అనవసరంగా ఓడించామా ? అని నియోజకవర్గ ప్రజలు వాపోతోన్న పరిస్థితి. అంతేకాదు.. సదరు మహిళా ఎమ్మెల్యే కుమారుడు ఏకంగా ఓ భూవివాదానికి సంబంధించి ప్రభుత్వ అధికారిని లైన్‌లోకి తెచ్చుకునేందుకు.. తాము చెప్పినట్టు చేసేందుకు ఆయన కుటుంబాన్ని కూడా కిడ్నాప్ చేయించారు.
అంతే కాకుండా కొన్ని ప్రభుత్వ భూములు, పేదల భూముల రికార్డులు ఆన్‌లైన్లో రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. ఇది కూడా పెను సంచలనంగా మారింది. అయితే.. ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్న వైసీపీ నేతలు నోరు మెదిపే సాహసం చేయకపోయినా ఆ మహిళా నేత రాజకీయం వచ్చే ఎన్నికలకు ముందే ముగిసిపోతుందని చెవులు కొరుక్కుంటున్నారు.