బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం ‘కేసీఆర్ కనబడుట లేదు’ అంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పోస్టర్లు హల్‌చల్ చేస్తున్నాయి.పదేళ్ళు సీఎంగా అధికారంలో ఉన్న కెసీఆర్‌ని కొందరు కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తన్నట్లు కనిపిస్తోంది.సీఎం రేవంత్‌రెడ్డి నిత్యం బీఆర్ఎస్ ను తుదముట్టేస్తున్నారు.ఆయన బాటలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గులాబి పార్టీని ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా కేసిఆర్ కనిపించడం లేదంటూ మహానగరంలో పోస్టర్‌లను అతికించారు. హైద్రాబాద్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేడు అంటూ సదరు పోస్టర్లలో పేర్కొనడం గమనార్హం.ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారనేది అటుంచితే కెసిఆర్‌ను తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదలతో పదుల సంఖ్యలో పలువురు మృతి చెందగా, వేలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఖమ్మంతోపాటు ఇతర జిల్లాల్లోనూ భారీ పంట నష్టం జరిగింది.సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
అటు బీజేపీ నేతలు సైతం వరద బాధితులను పరామర్శించి పాలు,నీరు వంటివి పంపిణీ చేశారు.అయితే ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ వరద బాధితులను పరామర్శించేందుకు బయటకు రాకపోవడంపై ఇప్పటికే అధికార పక్షం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కనబడుట లేదంటూ పోస్టర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. కేసీఆర్ ప్రజల్లోకి రాకపోయినప్పటికీ.. హరీశ్ రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.అయినప్పటికీ కెసీఆర్‌పై ట్రోల్స్ కొనసాగుతున్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే ఈ పోస్టర్‌లు వేలిశాయని,కాంగ్రెస్ నేతలు పోటీపడి మరీ పోస్టర్‌లను వేయించారని విమర్శలు వినిపిస్తున్నాయి.కాగా భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. ఖమ్మం వరద బాధితులకు సాయం అందించేలా కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రకటించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో హరీశ్‌రావు పర్యటిస్తున్నా…. కారు పార్టీ ప్రజాప్రతినిథులు ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించినా కెసిఆర్‌పై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.కెసీఆర్ కనిపించడం లేదంటూ పోస్టర్‌లు వెలుస్తూనే ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్ళేందుకు ఓవైపు కెసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా ఇప్పుడు వరద ప్రాంతాల్లో కనిపిస్తున్న పోస్టర్‌లు బీఆర్ఎస్‌కి కాస్త ఇబ్బందిగా తయారయ్యాయి.