Lasya Nanditha: తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయ అరంగేట్రం.. పిన్న వయసులోనే ఎమ్మెల్యే

-

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌‌పై ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లాస్య నందిత తన తండ్రి దివంగత ఎమ్మెల్యే జి. సాయన్న. లాస్య నందిత హైదరాబాద్, అశోక్ నగర్ లో జి. సాయన్న, గీత దంపతులకు జన్మించింది. ఆమె కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేసింది. తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పికెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరింది. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైంది. మళ్లీ ఆమె 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయింది.

కంటోన్మెంట్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణలతో మరణించడంతో 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను లాస్య నందితకు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కేటాయించింది. ఆ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఈ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టి ప్రయత్నాలే చేసినా.. కేసీఆర్ నందితపై నమ్మకం ఉంచారు. అయితే 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మాత్రం ఆమె ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి వెంటే ఉంటూ నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. తండ్రి మరణం తర్వాత బీఆర్ఎస్ టికెట్ కేటాయించటంతో ఇటీవల ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

కానీ అంతలోనే ఆమె ప్రాణాలు కోల్పోవంటం అంతులేని విషాదాన్ని నింపింది. నేడు లాస్య నందిత మేడ్చల్ నుంచి పటాన్‌చెరువు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ ముందు వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో సడన్ బ్రేక్ వేశాడు. దాంతో కారు అది తప్పి ఔటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోకవడంతోనే చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్‌ను మదీనాగూడ శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news