ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని సినీ నటుడు మోహన్ బాబు విమర్శించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై తన మాటను నిలబెట్టుకోలేకపోయారన్నారు. విద్యారంగం అభివృద్ధి కోసం ఏపీ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
తిరుపతిలో విద్యానికేతన్ స్కూల్ లో విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంలో మోహన్ బాబు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై చంద్రబాబును విమర్శించారు. 2014 నుంచి 2018 వరకు దాదాపు 19 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ లో ఉందని.. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మోహన్ బాబు అన్నారు.
మాట నిలబెట్టుకోకుండా.. ఇప్పుడు రాష్ట్రమంతా తిరుగుతూ అమలు చేయలేని హామీలు ఎందుకు ఇస్తున్నారంటూ చంద్రబాబును మోహన్ బాబు ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో చేరలేదని.. తాను ప్రభుత్వ వ్యతిరేకిని కాదని… కేవలం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే మాట్లాడుతున్నానని తెలిపారు. మరి.. మోహన్ బాబు వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.