ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు పెట్టి 14 పార్టీల మద్దతు కూడగట్టా: కేవీపీ

-

ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు పెట్టి 14 జాతీయ పార్టీల మద్దతు కూడగట్టానని ఏపీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. సమైక్య ఉద్యమకారులందరిపై పెట్టిన కేసుల నుంచి చంద్రబాబు తప్పించలేదని ఆరోపించారు. ఢిల్లీలో చనిపోయిన అర్జున రావు మాదిరిగానే ఉద్యమ సమయంలో ఆత్మహత్య చేసుకున్న మునికోటి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

కేవీపీ ఎవరు అని అడిగే స్థితి నుంచి ఇప్పుడు కేవీపీ పార్టీలో ఉన్నాడు అని అడిగే స్థాయికి చంద్రబాబు వచ్చాడన్నారు. కేవీపీ రాసిన ఉత్తరంపై మీడియా ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా తన పార్టీ విధేయతను సందేహించేలా అగాథం సృష్టించే ప్రయత్నం చేశారన్నారు.

నా పార్టీకి నాపై వాత్సల్యం ఉంది. నేను సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం చేసిన సమయంలోనే నా పార్టీ నన్ను రాజ్యసభకు తిరిగి నామినేట్ చేసింది. నా పోరాటాన్ని రాజ్యసభ చైర్మన్ కూడా గుర్తించి సభలో ప్రశంసాపూర్వకంగా ప్రస్తావించారు. పార్టీ విధేయతలో మాత్రం నేను సదా సేవకుడినే. రాహుల్ ను ప్రధానిని చేసేంత వరకూ మనం శ్రమించాలని రాజశేఖర్ రెడ్డి నాకు ఇచ్చిన ఆదేశం నెరవేరే వరకు నేను విశ్రమించను. కాంగ్రెస్ లోనే కొనసాగుతా.

మీరు ఈరోజు చేసిన ఉద్యమం కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తోంది. నా ఆత్మశుద్ధినా మీరు ప్రశ్నించేది. కొత్త వైష్ణవుడికి పంగనామాలు ఎక్కువ అన్నట్టుగా.. చంద్రబాబు ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారు. ఒక రోజు ఒకలా చెప్పిన మాటను.. మరో రోజు మార్చి చూపగలరు అంటూ చంద్రబాబుపై కేవీపీ విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version