ఏ మంత్రికైనా.. ప్రభుత్వం ఏదైనా.. ప్రశాంతంగా పనిచేసుకుని పోవాలని, తన శాఖపై పెద్దగా ఎలాంటి మచ్చలు , మరకలు రాకుండా చూసుకోవాలనే ఉంటుంది. ఈ క్రమంలో శాఖ కార్యకలాపాలపైనా మంత్రు లు జాగ్రత్తగా ఉంటారు. కానీ, అదేం చిత్రమో.. వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి ఆళ్ల నాని విషయంలో మాత్రం ఇది పూర్తిగా రివర్స్ అయింది. ఆయన అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన అతి పెద్ద సవాల్.. కరోనా. రాష్ట్రంలో కరోనా ప్రభావం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఈ క్రమంలో వైద్య శాఖ మంత్రిగా ఆళ్ల నాని.. నిరంతరం సమీక్షలు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని మెరుగు పరిచేందుకు ప్రయత్నించడం మనకు తెలిసిందే.
ఇక, ఈ సమస్య ఇలా తీరకముందుగానే.. మరోవైపు తన సొంత నియోజకవర్గం ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తెరమీదికి వచ్చింది. వణుకు, నరాల బలహీతన, నురగలు కక్కడం వంటి లక్షణాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి మూడు రోజులు అయినా. కారణాలు కనిపిపెట్టలేకపోయారు. ఇది మరింతగా మంత్రికి ఇబ్బందికర వాతావరణంగా మారిపోయింది. తన సొంత నియోజకవర్గంలోనే ఇలా జరగడంతో మంత్రికి ఊపిరి ఆడడం లేదని చెబుతున్నారు. ఒకటి తర్వాత ఒకటి గా వచ్చిన సమస్యలను పరిష్కరించడం.. మంత్రి కి పెను ఇబ్బందిగా పరిణమించిందని తెలుస్తోంది.
పైగా ప్రజలకు సంబంధించిన వ్యవహారం కావడం, అత్యంత సున్నితమైన సమస్య కావడంతో మంత్రి తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు. ఈ చిన్న లోపం జరిగినా.. ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడడం వంటివి కూడా మంత్రిని ఇబ్బంది పెడుతున్నాయి. ఏదేమైనా .. ఈ రెండు విషయాలు ఎంత త్వరగా పరిష్కారం అవుతాయా? అని ఆయన ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. మరి ఎప్పటికి పరిష్కారం అవుతాయో చూడాలి.