ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన వెనుక ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో ఆయన పర్యటిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలవాలని బీజేపీ వ్యూహాలు రచించినా ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని చర్చకు తావిచ్చింది.
ఈ ఫలితాలతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ మెజారిటీ స్థానాలను తెలంగాణ నుంచి గెలుస్తుంది అనే సంకేతాలు పంపింది. ఎన్నికల వ్యూహాలు రచించటంలో, ఓటర్లను ఆకర్షించడంలో ప్రధాని నరేంద్ర మోడీ దిట్ట. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, ఎత్తులు వేయడంలో ఆరితేరిన వ్యక్తి కూడా మోడీనే. సార్వత్రిక ఎన్నికల వేళ ఆయన మరోసారి తనలోని రాజకీయ నైపుణ్యాలకు పదునుపెడుతున్నారు.
కూటమిగా 400, సొంతంగా 370 స్థానాలను గెలుపొందడమే ధ్యేయం అని ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించి తొలి అడుగు వేసింది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలోనూ ఎస్సీ, ఎస్టీలు ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి కీలకమైన లోక్ సభస్థానాలపై రాజకీయ పక్షాలు ప్రధానంగా దృష్టి సారించాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటన.. పైగా ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌లో 56 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 10 చోట్ల అయినా విజయం దక్కించుకుని తీరాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న దరిమిలా ప్రధాని పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మరోసారి తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు మళ్లీ శ్రీకారం చుట్టనున్నారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో కూడా ప్రధాని పర్యటిస్తారు. ఇదంతా కూడా ఎన్నికల వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో మాట్లాడి బీజేపీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీపై మోదీ విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని సెటైర్లు వేశారు.కుటుంబ పార్టీల్లో దోచుకోవడం, అబద్ధాలు చెప్పడమనే రెండు లక్షణాలు ప్రదానంగా ఉంటాయన్నారు.ఆదివాసీలకు గౌరవం దక్కితే, కుటుంబ పార్టీలు భరించలేకపోతున్నాయని, ఆదివాసీల అభ్యున్నతి కోసం నిర్ణయాలు తీసుకుంటే మిగతా పార్టీలు బీజేపీపై రెచ్చిపోతున్నాయని మోదీ తప్పుబట్టారు.
ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిని ఘనత బీజేపీకే దక్కుతుందని గుర్తు చేస్తూ తెలంగాణలో సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించామన్నారు. 140 కోట్ల భారత ప్రజల కలల సాకారం కోసం పనిచేస్తానన్న ప్రధాని మోదీ. దేశంలో 7 మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. అందులో ఒకటి తెలంగాణలో రాబోతున్నట్లు మోదీ వెల్లడించారు.