రాష్ట్రంలో పాల వినియోగానికి తగినంతగా ఉత్పత్తి లేదు. పాడిపరిశ్రమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.
మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో పాడి పరిశ్రమది ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికి అత్యధికంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. దేశంలో సాగును బలోపేతం చేసి రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొన్న కేటాయించిన బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించామని.. పాడి రంగం అభివృద్ధి కోసం సహాయ, సహకారాలు అందించనున్నట్టు తెలిపారు.