హుజురాబాద్‌లో గులాబీ పార్టీకి కొత్త చిక్కులు.. ఆ అభ్యర్థితో ప్రజల్లోకి ఎలా వెళ్తారో?

-

అసైన్డ్ ల్యాండ్స్ ఆక్రమణ కేసుల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలో హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక మారిన రాజకీయ పరిణామాలతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే, ఈ ఉప ఎన్నికలో ఈటల ఓడిపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు అంతమయ్యే చాన్సెస్ ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే ఈటలను ఓడించేందుకుగాన స్వయంగా సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పావులు కదుపుతున్నారు. ‘దళిత బంధు’ స్కీమ్, గొర్రెల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పింఛన్ల మంజూరు వంటివి అధికార పార్టీ విస్తృతంగా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈటలను ఓడించేందుకుగాను విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలో దించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

గులాబీ బాస్ ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు టాక్ వినిపించినా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. అయితే, గెల్లు హుజురాబాద్ వాస్తవ్యుడే అయినా ఆయనతో గులాబీ పార్టికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ నేతలకు గెల్లు పరిచయం ఉన్నప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆయన పూర్తిగా కొత్త మనిషే..కాబట్టి ఈయనతో ప్రచారంలోకి ఎలా వెళ్లాలి? అని గులాబీ నేతలు మధనపడుతున్నట్లు తెలుస్తోంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ఫిక్స్ చేయడంలో ఆయన సామాజిక వర్గమే బలమైన కారణమైందనే వాదనలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. బీసీని బీసీతోనే ఓడించాలనే అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికను రాష్ట్రప్రజానీకం అత్యంత క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నిక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నదని ఇప్పటికే కొందరు రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version