మస్ట్ రీడ్: పాదయాత్రల సీజన్… రికార్డులకు బ్రేక్?

-

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రలది ఒక ప్రత్యేకస్థానం. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు.. అధికార పక్ష వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల్లోకి కాలినడకన వెళ్తూ.. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ.. రాబోయేది మంచి కాలం అని భరోసా ఇస్తూ.. ఆనాటి ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ.. ముందుకు సాగుతుంటారు.

ఇలా పాదయాత్రలు చేసినవారిలో జాతీయ స్థాయిలో ఒక్కరే ఉండగా.. రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్, చంద్రబాబు, జగన్ లు ఉన్నారు. అయితే వీరి సరసన ఇప్పటికే బండి సంజయ్ చేరగా.. త్వరలో వైఎస్ షర్మిళ, రేవంత్ రెడ్డి కూడా చేరబోతున్నారు. ఒకే రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు మూడు పార్టీల నేతలు విడివిడిగా పాదయాత్ర చేయడం దేశచరిత్రలో దాదాపు ఇదే ప్రథమం!

జాతీయ స్థాయిలో..:

జాతీయ స్థాయిలో సుదీర్ఘ పాదయాత్ర చేసినవారు మాజీ ప్రధాని చంద్రశేఖర్ మాత్రమే! న్యూఢిల్లీ లోని రాజ్ ఘాట్ నుంచి మొదలైన ఆయన పాదయాత్ర.. కన్యాకుమారి దాకా సుమారు 4260 కి.మీ కొనసాగింది. ఈ యాత్ర 1983 జనవరి – 6న మొదలయ్యి, 1983 జూన్ 25న ముగిసింది.

వైఎస్సార్ “ప్రజాప్రస్థానం”:

ys rajasekhara reddy padayatra

రాష్ట్రస్థాయిలో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో కాంగ్రెస్ నాయకుడిగా పాదయాత్ర చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభమైన వైఎస్సార్ పాదయాత్ర సుమారు 1500 కి.మీ మేర సాగింది. ఫలితంగా 2004లో ప్రజలు ఆయన్ను అఖండ మెజార్టీతో గెలిపించారు. ఫలితంగా.. చరిత్రలో వైఎస్సార్ పాదయాత్ర ప్రత్యేకంగా నిలిచింది!

చంద్రబాబు “వస్తున్నా… మీకోసం”:

 

2012 అక్టోబర్ 2న హిందూపురం నుంచి నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలలో 2817కి.మీ. మేర “వస్తున్నా… మీకోసం” పేరున ఈ పాదయాత్ర సాగింది. 2013 ఏప్రిల్ 28న విశాఖలోని అగనంపూడి వద్ద ముగిసింది. ఫలితంగా 2014లో జరిగిన ఎన్నికల్లో అధికారం దక్కింది.

జగన్ “ప్రజాసంకల్పయాత్ర”:

2017 నవంబర్‌ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైంది. నాటి చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ.. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భవిష్యత్తుపై భరోసా ఇస్తూ ఈ యాత్ర సాగింది. ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకూ 3648 కిలోమీటర్లు ఈ యాత్ర సాగింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుంధుభి మోగించింది.

బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”:

bandi-sanjay

అవినీతి, నియంతృత్వ పాలస సాగిస్తున్న సీఎం కేసీఆర్ ను గద్దె దింపడమే లక్ష్యం అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తన పాదయాత్రను స్టార్ట్ చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం హైదరాబాద్ నగరం గుండా ఆయన పాదయాత్ర స్టార్ట్ అయ్యింది.

వైఎస్ షర్మిల.. “నాడు – నేడు”:

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

వైఎస్ జగన్ జైలుకు వెళ్లిన సమయంలో వైఎస్ షర్మిల 2012లో పాదయాత్ర చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 3,112 కిలోమీటర్ల నడిచి.. అన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తొలి మహిళగా రికార్డును సొంతం చేసుకున్నారు.

తాజాగా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ హోదాలో.. షర్మిల తెలంగాణలో అక్టోబర్ 20వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రను ఆమె తండ్రి వైఎస్సార్ లాగే చేవెళ్ల నుంచి ప్రారంభిస్తున్నారు.

పాదయాత్రలందు ఈ పాదయాత్రలు వేరయా:

ఇప్పటివరకూ జరిగిన అన్ని పాదయాత్రలది ఒక లెక్క.. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పాదయాత్రలది మరో లెక్కలా ఉంది! ఇంతవరకూ వైఎస్సార్ చేసినా, చంద్రబాబు చేసినా, జగన్ చేసినా.. ఒకే ప్రతిపక్ష పార్టీగా చేశారు. అయితే ఇప్పుడు అధికార తెరాస పాలనకు వ్యతిరేకంగా ఇప్పటికే బీజేపీ నుంచి బండి సంజయ్.. త్వరలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నుంచి షర్మిళ, అనుమతి దొరికితే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి లు పాదయాత్ర ఉండొచ్చు.

దీంతో ఎవరి పాదయాత్రను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు.. భవిష్యత్తులో ఎవరి పాదయాత్ర అధికారం వరకూ వెళ్లగలుగుతుంది.. ఎవరి పాదయాత్ర చరిత్ర సృష్టించబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది!

ఎందుకంటే.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటివరకూ ఏ ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేసినా… దాని ఫలితం కచ్చితంగా అధికార యోగం గా జరిగింది. ప్రజలు పట్టం కట్టారు! మరి రెండు మూడు పార్టీలు ఒకేసారి ఒకే సమస్యలపై పోటీ చేయబోతున్న నేపథ్యంలో.. “బీజేపీ – వైఎస్సార్ టిపి” కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే మాత్రమే ఈ పాదయాత్రల రికార్డు నిలబడి ఉంటుందన్నమాట!! అలాకానిపక్షంలో ఇద్దరిలో ఎవరు అధికారంలోకి రాకపోయినా, ఇద్దరూ రాకపోయినా.. పాదయాత్రల రికార్డుకి బ్రేక్ పడినట్లే!

Read more RELATED
Recommended to you

Exit mobile version