బీఆర్ఎస్ కొంప ముంచుతున్న రుణమాఫీ… బీఆర్ఎస్ నేతల రాజీనామాలు తప్పవా లేదా

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన రుణమాఫీ పథకం మాజీమంత్రి హరీష్ రావు కొంప ముంచెలా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఈ పథకం కొత్త రకం చిచ్చు రేపింది. ఇరు పార్టీల నేతల పరస్పర రాజీనామాల విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆగస్టు 15లోపు రుణమాఫీ పూర్తి చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అప్పుడు ఎప్పుడో సవాల్ చేశారు. దానిని చాలెంజ్‌గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌ను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తోంది.అందులో భాగంగా ఇప్పటికే 11 లక్షల మందికి లక్ష రూపాయల రుణమాఫీ చేసింది. దీంతో కాంగ్రెస్ నేతలు హరీశ్ రావు రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు.ఇప్పుడు తెలంగాణలో ఈ రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ అయింది.

మూడు విడతల్లో రూ.2లక్షలు మాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడింది. మొదటి విడతగా రూ.లక్ష రుణమాఫీ చేసింది. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లు జమ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క బటన్‌తో కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేశారు. మరికొద్ది రోజుల్లో రూ.లక్షన్నర రుణమాఫీ చేస్తామని మొత్తంగా ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ హామీని పూర్తిగా నెరవేరుస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే దాదాపు రూ.31 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. అయితే అన్ని నిధులు తేవడం సాధ్యం కాదంటూ బహిరంగంగా సవాళ్లు విసురుకున్నారు. గడువులోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని హరీశ్ రావు ప్రకటించగా మరి కొంత మంది బీఆర్ఎస్ నేతలు సైతం రాజీనామాలు చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు దానినే పట్టుబడుతున్నారు.

తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఆ తరువాత ఏర్పడిన పరిస్థితులతో గందరగోళంలో పడింది. ఇప్పటికే దాదాపు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వరుసలో ఉన్నారు. అయితే ఇప్పుడు రుణమాఫీపై సాగుతున్న సవాళ్లు ఇంకాస్త తలనొప్పిలా మారాయి. పైకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ స్పందించకపోయినా అంతర్గతంగా తన ఎమ్మెల్యేలపై మండిపడినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ చేస్తున్న దాడిని భరించలేక హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రావచ్చు అని చర్చలు కూడా నడుస్తున్నాయి. తెలంగాణలో ఈ టాక్ ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version