ఎందరో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కన్నీళ్లే ఇచ్చారు. కన్నీళ్లే మిగిల్చి గర్భశోకం మిగిల్చి వెళ్లారు. ఇందులో తల్లిదండ్రుల తప్పిదాలు లేవా అంటే ఎందుకు లేవు అవీ ఉన్నాయి అని ఇవాళ అంతా మరో సారి చర్చకు పెడుతున్నారు నాటి ఘటనలను! ఎందుకంటే నారాయణ విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేసే విధానం, ర్యాంకులు, మార్కులు కోసం ఒత్తిడి పెట్టే విధానం మామూలుగా ఉండదు అని, ఆ టార్చర్ భరించడం కష్టమయ్యే చాలా మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని అంటున్నారు కొందరు ప్రత్యక్ష సాక్షులు.
మంచో, చెడో నారాయణ అరెస్టు ఫలితం అన్నది ఏ విధంగా ఉన్నా, కార్పొరేట్ విద్యా సంస్థలన్నింటి పైనా నిఘా పెంచాల్సిన తరుణం కూడా వచ్చిందని అంటున్నారు. ఓ విధంగా వైసీపీ చర్యలకు ప్రశంసలు దక్కుతూనే, మరోవైపు మిగతా నిందితులకూ కఠిన శిక్షలు వేయాలని కోరుతున్నారు. పేపర్ లీకేజీ అన్నది ఇవాళ విషయం కాదని, ఇదొక ఆర్గనైజ్డ్ క్రైం అని ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి మాటలు కూడా అక్షర సత్యాలే !
ఇంకా చెప్పాలంటే..
పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీకి సంబంధించి మాజీ మంత్రి, ప్రముఖ విద్యా సంస్థల అధినేత నారాయణ అరెస్టు, తరువాత బెయిలు వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ విషయమై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మద్దతు వస్తోంది. చట్ట సంబంధ చర్యలు ఎలా ఉన్నా కూడా ఇవాళ అనేక విషయాలు, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు ఒక్కటేంటి అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఒకందుకు జగన్ చర్యలకు మద్దతు ఉంటూనే, మరోవైపు ఆ రోజు నారాయణ విద్యా సంస్థల్లో చీకటి గదుల్లో మగ్గిపోయి, న్యూనతను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను ఒక్కసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.