పార్టీ మార్పు పై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతల అయోమయం

-

వరస ఓటములు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను డైలమాలో పడేస్తున్నాయి. మంచిరోజులు రాకపోతాయా అని పార్టీలోనే ఉన్నవారి ఆలోచనలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో కాంగ్రెస్‌ నేతలు ఉత్సాహంగా కనిపించారు. ఇప్పుడు ఉస్సూరుమంటూ ఉంటున్నారట.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది కొందరు కాంగ్రెస్‌ సీనియర్ల ఆలోచన.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతల పరిస్థితి అలాగే ఉందట.

రంగారెడ్డి జిల్లాలో మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి అలాగే ఉంది. నాడు రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు.. నేడు బొంగరాలు కూడా తిప్పలేని స్థితిలో ఉన్నారని కేడరే కామెంట్‌ చేస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్‌తో సంబంధమే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు నాయకులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలకు పార్టీ పిలుపిస్తే లీడ్‌ చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో కేడర్‌ దిక్కులు చూస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాలుగా మారింది. ఈ జిల్లాలకు అతికష్టంమీద డీసీసీ అధ్యక్షులను నియమించినా ఊపు లేదు.

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ వర్గాలుగా నాయకులు విడిపోయారు. ఈ కోవలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ ఉన్నారట. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తోనే తన ప్రయాణం సాగుతుందని ఆయన కార్యకర్తలకు చెబుతున్నా.. పార్టీ కార్యక్రమాలకు రావడం లేదు. అలా అని రేవంత్‌ నిర్వహిస్తున్న నిరసనలకు వెళ్లడం లేదు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పరిస్థితి గందరగోళంగా మారింది. ఉన్నట్టుండి కాంగ్రెస్‌ హైకమాండ్‌పై విమర్శలు చేస్తారు. బీజేపీ పథకాలను ప్రశంసిస్తారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో కూడా తెలియదని చెబుతాయి గాంధీభవన్‌ వర్గాలు. ఉత్తమ్‌, రేవంత్‌ వర్గాలు కాకుండా.. తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని కొండా తయారు చేసుకున్నారు.

కొండా గెలిపించుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఉనికి కోసం పోరాడే పరిస్థితి. అడపా దడపా గాంధీభవన్‌లో ప్రత్యక్షమైనా.. ఇప్పుడేం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. బీజేపీలోకి వెళ్తారన్న చర్చ నడుస్తుంది. మేడ్చల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీగా ఉండటంతో ఆ పదవి ఆయనకు కలిసొచ్చింది. పైగా పీసీసీ చీఫ్‌ రేస్‌లోను ఉన్నారు.

నేతల మౌనం అర్థం కాక కార్యకర్తలు ఇతర పార్టీ వైపు చూస్తున్నారు. అవకాశం లభిస్తే కండువా కప్పేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version