తెలంగాణ కాంగ్రెస్ లో రోజురోజుకు కాక రేగుతోంది. రోజుకో రకమైన విభేదాలు బయటపడుతున్నాయి. దాదాపు అన్నీ వివాదాలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతుండటం గమనార్హం. ఆయనకు తోడు ఇప్పుడు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పైనా చాలా మంది సీనియర్ నేతలు కోపంగా ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డిలు బహిరంగంగానే వారిపై విమర్శలు కురిపించారు.
తాజాగా మర్రి శశిధర్ రెడ్డి.. రేవంత్, మాణిక్కంలపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్‌తో ఆమె సమావేశమయ్యారు. మర్రి శశిధర్‌రెడ్డి సమస్య సర్దుకుంటుందని.. ఆవేదనలో అలా మాట్లాడారని ఆమె అన్నారు. శశిధర్ రెడ్డి ఓపికగా ఉండే వ్యక్తిగా పేర్కొన్న ఆమె.. ఆయనకు మనసులో ఏదో బాధ అనిపించి అలా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు.
‘మర్రి శశిధర్ రెడ్డి ఆవేదనలో మాట్లాడారు. ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ మనిషే. రేవంత్ రెడ్డితో పాటు అందరు సర్దుకుని ముందుకు పోవాలి. ఆరోపణలు వస్తునే ఉంటాయి. మునుగోడులో విజయం మాదే.’-రేణుకా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి
రేవంత్ రెడ్డి కూడా ఏదైనా ఉంటే సరిదిద్దుకోవాలని రేణుకా చౌదరి తెలిపారు. పార్టీలో తమను అవమానించేవారెవరూ లేరని.. అవమానిస్తే దుమారం ఎలా లేపాలో కూడా తమకు తెలుసునని పేర్కొన్నారు. ఖమ్మంలో తనను ఎదుర్కొనే వారు లేరని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోవడం బాధాకరమేనని.. మునుగోడులో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపాలోనూ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని వివరించారు.