తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా లాగేసుకుంటున్నారు.అయితే ఇప్పుడు ఆయన కేసిఆర్‌ను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి సమయం, సందర్భాన్ని బట్టి కొంత మందిపై అనర్హతా వేటు కూడా పడుతుందని చెప్పారు. రేవంత్ వ్యూహాత్మకంగా ఈ మాట చెప్పారని ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే..సీఎం ఆఫ్ ది రికార్డు చెప్పారు కానీ ఈ విషయం అందరికీ చేరేలా చెప్పారు. తన దగ్గర ఆ ఆస్త్రం కూడా ఉందన్న సంకేతాలు పంపారు.ఇంతకీ అనర్హత వేటు ఎవరిపై ఉంటుంది అనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో కూడా పలువురిపై అనర్హత వేటు వేసీన సందర్భాలు ఉన్నాయి. శాసనమండలి చైర్మన్ గా ఉన్న స్వామిగౌడ్ పై దాడి చేశారన్న కారణంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లపై అప్పటి స్పీకర్ అనర్హతా వేటు వేశారు. ఇందు కోసం పెద్ద డ్రామా నడిపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి డ్రామాలు నడిపి తాను కూడా అనర్హతా వేటు వేయించగలనని రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో సంకేతాలు పంపారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే రేవంత్ మనసులో టార్గెట్ ఉందని… ఆ టార్గెట్ లో ఉన్న వారు ఎవరా అని కాంగ్రెస్ వర్గాలు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. బీఆర్ఎస్‌కి చెందినవారిపైనే టార్గెట్ ఉంటుందనే మరికొందరి వాదన. అసెంబ్లీకి రాకుండా కాలయాపన చేస్తున్న కెసీఆర్‌ని సీఎం టార్గెట్ చేశారా అనే ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది.
ఇప్పటికే ఎమ్మెల్యేలను లాక్కుంటూ బీఆర్ఎస్ అధినేతకు నిద్ర లేకుండా చేస్తున్న రేవంత్ మరింతగా ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా తనను ఎన్నివిధాలుగా ఇబ్బందులకు గురిచేశారో గుర్తుచేసుకుంటున్న రేవంత్… అంతకంతకూ దెబ్బతీయాలని కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను దెబ్బకొడుతున్నారు. ఇప్పుడు అనర్హత పేరుతో కీలక నేతపై వేటు వేస్తే దెబ్బకు దెబ్బ తీసినట్లు ఉంటుందని రేవంత్ భావిస్తున్నారు.
అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ పై అనర్హతా వేటు వేయించడానికి నిబంధనలు అనుకూలంగా ఉన్నాయని పరోక్షంగా సంకేతాలు పంపిస్తున్నారు రేంవత్. అదే సమయంలో అసెంబ్లీలో అనుచిత ప్రవర్తన దగ్గర నుంచి ఏదో ఓ కారణం చూపి స్పీకర్ తో అనర్హతా వేటు వేయిస్తే గులాబి పార్టీని కాంగ్రెస్‌లో కలిపేలా దారికి తెచ్చుకోవచ్చని ఆ విధంగా అధినేత్రి సోనియాగాంధీని ప్రసన్నం చేసుకోవచ్చని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఏమి జరుగబోతోందో చూడాలి మరి.