తెలంగాణ రాజకీయాల్లోకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఇటీవల ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. అయితే, ఎన్ని ఆశలతో తెలంగాణలో అడుగుపెట్టి రాజకీయం చేయాలనుకున్న షర్మిలకు అప్పుడే షాక్ తగలింది. పార్టీలో కాస్త చురుగ్గా ఉన్న మహిళా నేత ఇందిరా శోభన్ పార్టీకి రాజీనామా చేసింది. దీంతో పార్టీ అధినేత్రి షర్మిల తర్వాత అంతలా పార్టీలో మాట్లాడగలిగే నేతలు పార్టీలో లేకుండా పోయారు. ఇక ఆమె పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. ఏపూరి సోమన్న ఉన్నప్పటికీ ఆయన్ను తెలంగాణ సమాజం పాటగాడిగానే గుర్తిస్తుంది.
ఇక ఇటీవల ‘దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభలు కూడా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్‌కు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె వైఎస్‌ఆర్‌టీపీకి రాజీనామా చేసిందా? అన్న చర్చ జరుగుతున్నది. అయితే, తన రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలో మళ్లీ ప్రకటిస్తానని ఇందిరా శోభన్ ప్రకటించింది. ఇకపోతే వైఎస్ఆర్‌టీపీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఉంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. షర్మిల పార్టీని నడిపించేందుకు ఎటువంటి ప్లాన్స్ వేస్తుందో చూడాలి మరి..