తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న ధర్మవరం నియోజకవర్గంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. పరిటాల రవి అనుచరుడుగా ఉన్న మధుసూదన్‌రెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పరిటాల రవీంద్ర అనుచరుడు రేగాటిపల్లి (చిలకం) మధుసూదన్‌రెడ్డి ప్రకటించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో తనకు 26 సంవత్సరాల అనుబంధముందన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని మధు అనుచరులు చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
చిత్తూరులోనూ టిడిపికి షాక్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం ఎంపీపీగా ఉన్న కొండా గీతమ్మ, కొండా సిద్ధార్థ్ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ద్వారాకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వారు కలిశారు. టీడీపీలో 40 ఏళ్ల పాటు కొనసాగిన కొండా సిద్ధార్థ్ కుటుంబాన్ని జననేత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై టీడీపీ నేతలకే నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఎంతోకాలం టీడీపీలో కొనసాగిన కొండా సిద్ధార్థ్ కుటుంబం ఆ పార్టీని వీడిందంటే చంద్రబాబు ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందన్నారు. కొండా సిద్ధార్థ్ మాట్లాడుతూ.. టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్ పాటించిన విలువలు ప్రస్తుతం టీడీపీలో లేవని అన్నారు. అందుకే 40 ఏళ్లు టీడీపీలో ఉన్నప్పటికీ.. విలువల కోసమే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. టీడీపీ నిజమైన నేతలకు, కార్యకర్తలకు ప్రస్తుతం విలువ లేదని తెలిపారు.
కొండపి వైసీపీ అభ్యర్థి వెంకయ్యే…
సింగరాయకొండ(ప్రకాశం జిల్లా): రానున్న ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుంచి డాక్టర్ మాదాసి వెంకయ్య పోటీ చేస్తారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా కలికివాయి జాతీయ రహదారిపై వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కందుకూరు రోడ్డు కూడలిలోని మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొండపి, కనిగిరి నియోజకవర్గాల్లో కిడ్నీబాధితులు 400ల మందికి పైగా మృతి చెందారని వివరించారు. తాగునీరు అందిస్తే వారు బతికివుండేవారని పేర్కొన్నారు.కాగా వెంకయ్య నియామకంపై మునుపటి నియోజకవర్గ ఇన్‌చార్జ్ అశోక్‌బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకయ్య ఎలా గ్రామాల్లో తిరుగుతారో చూస్తామని అశోక్‌బాబు అనుచరులు బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నారు.