తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టిడిపి పరిస్థితి దారుణంగా ఉంది. టిడిపి ఇన్చార్జిగా ప్రస్తుతం బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తిరుగులేని నాయకుడు. 2019 ఎన్నికల ముందు అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నందున అతని కుమారుడైన సుధీర్ రెడ్డిని తన రాజకీయ వారసుడు గా ప్రకటించారు. 2019 ఎన్నికలలో సుధీర్ రెడ్డి.. బియ్యపు మధుసూదన రెడ్డి చేతిలో ఓటమి పొందారు.
ఓటమి తర్వాత సుధీర్ రెడ్డి హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యారు. అటు బొజ్జల అనారోగ్యంతో మరణించారు. దీంతో కొన్ని రోజులు సుధీర్ రాజకీయాల్లో కనిపించలేదు. తర్వాత సుధీర్ కు బాబు క్లాస్ ఇవ్వడంతో మళ్ళీ కాళహస్తికి వచ్చి పనిచేయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో వైసీపీ పై అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మునిరామయ్య, ఎస్సీవి నాయుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. వీరిద్దరి రాకతో టీడీపీ శ్రేణులు ఉత్సాహం ఉరకలు వేసింది. వీరిద్దరి రాక తర్వాత సుధీర్ రెడ్డి కాళహస్తికి నివాసం మార్చి ప్రజలకు చెరువులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కాళహస్తి టికెట్ ఎస్సీ వి నాయుడుకి అని వార్తలు కూడా వినిపించాయి నాయుడుకి టికెట్ ఇస్తే ముని రామయ్య కూడా మద్దతు ఇస్తానని ప్రకటించారు.
కానీ ఏమైందో తెలియదు గానీ టిడిపి నేతల ఉత్సాహం మూడునాళ్ళ ముచ్చట చేస్తూ వైసిపి నుండి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు టిడిపికి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో తమకు గుర్తింపు ఇవ్వడం లేదని, కాళహస్తి పర్యటనలో చంద్రబాబు నాయుడు తమను పట్టించుకోలేదని అలక వహించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి పై అవినీతి ఆరోపణలు, అధికార పార్టీపై ప్రజలలో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాళహస్తి టిడిపిలో నాయకులే కరువయ్యారని స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈసారి ఎన్నికలలో కూడా కాళహస్తిపై టిడిపి ఆశలు వదులుకోవాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు సొంత పార్టీ నేతలు అంటున్నారు.