ఇంతకాలం వైసీపీలో అసంతృప్తి నేతలు బయటకొస్తున్న విషయం తెలిసిందే. సొంత పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొందరు నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తూ..పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇదే క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు. ఇదిలా ఉంటే టీడీపీలో కూడా కొందరు అసంతృప్తి నేతలు ఉన్నారు. అయితే నిదానంగా వారు కూడా బయటకొస్తున్నారు. సీటు దక్కదనుకునే నేతలు పార్టీని వీడాలని చూస్తున్నారు.
ఇదే క్రమంలో టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీని వీడారు. తాజాగా జగన్‌ని కలిసి..ఆయన సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే 1999లో టీడీపీలో చేరిన జయమంగళ జెడ్పీటీసీగా పనిచేశారు. 2009లో కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో పొత్తులో భాగంగా కైకలూరు సీటు బిజేపికి ఇవ్వడంతో వెంకటరమణకు సీటు దక్కలేదు. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి పార్టీలో యాక్టివ్ గా లేరు. కానీ ఈ మధ్య కైకలూరులో యాక్టివ్ గా పనిచేస్తున్నారు.
అయితే ఈ సీటు విషయంలో జయమంగళకు క్లారీటీ లేదు. పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు దక్కుతుందనే ప్రచారం ఉంది. ఒకవేళ పొత్తు లేకపోయినా ఈ సీటు జయమంగళకు దక్కడం డౌట్ అని తెలుస్తోంది. అందుకే ఆయన వైసీపీ వైపుకు వెళ్లారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..జయమంగళని వైసీపీలో చేర్చారు. ఇదే క్రమంలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో..ఎమ్మెల్సీ సీటు జయమంగళకు ఇస్తారని తెలుస్తోంది.
అంటే టీడీపీలో సీటు దక్కదని తెలిసి..వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఆఫర్ రావడంతో అటు జంప్ చేశారని తెలుస్తోంది. ఇక వైసీపీలో కూడా ఈయనకు సీటు డౌటే. కాకపోతే ఈయన చేరడం వల్ల కైకలూరులో వైసీపీకి కాస్త ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీకి వస్తే ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఒకవేళ టిడిపి-జనసేన పొత్తులో ఉంటే కైకలూరులో వైసీపీ గెలుపు గగనమే.