ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో జంపింగుల పర్వం ఆగిపోతుందా? కొనసాగుతుందా? అనే చర్చ తెరమీదికి వ స్తోంది. ఈ ఏడాది ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్కరొక్కరుగా పార్టీ నుంచి నాయకులు జంప్ చేస్తు న్నారు. అయితే, ఇప్పటి వరకు పార్టీ నుంచి గెలిచిన వారు పెద్దగా లేరు. అయితే, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ జంప్ చేశారు. ఇక, పార్టీలో కీలక నాయకుడు, తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న యువ నేత దేవి నేని అవినాష్ కూడా పార్టీ మారిపోయారు.
ఇక, ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులతోనే పార్టీలో జంపింగులు ఆగిపోతాయా ? అనే విషయం ఆసక్తిగా మారింది. కానీ, విజయవాడ పరిస్థితిని గమనిస్తే.. ఇక్కడున్న కీలక నాయకుల్లో సఖ్యత లేకపోగా.. పార్టీ కార్యక్రమా లకు కూడా చాలా మంది కీలక నాయకులు దూరంగా ఉంటున్నారు. వీరిలో కాట్రగడ్డ బాబు ఒకరు. తెలుగు దేశాన్ని గుడ్ బై చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. వల్లభనేని వంశీతో కలిసి గానీ, ఆ తరువాత గానీ ఆయన వైఎస్సార్సీపీలో చేరతారని అంటున్నారు.
కాట్రగడ్డ బాబుతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన మాజీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరతారని, దీనికోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. విజయవాడ టీడీపీలో ఒకప్పుడు కాట్రగడ్డ బాబు కీలక చక్రం తిప్పారు. గతంలో హత్యకు గురైన కీలక రాజకీయ నాయకుడు కాట్రగడ్డ వెంకటనారాయణ వారసుడిగా ఉన్న బాబు.. టీడీపీలో చక్రం తిప్పారు. పార్టీలో సుదీర్ఘకాలం ఆయన పనిచేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆయన గళం వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు కార్యక్రమాలను నిర్వహించారు.
అయితే, గడిచిన ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన తీవ్ర అసంతృప్తిగానే కాలం గడిపారు. తనకు ఎలాంటి గుర్తింపూ లభించలేదని ఆయన పదేపదే మీడియా ముందు వాపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ విషయం చంద్రబాబుకు తెలిసిన తర్వాత కూడా ఆయనకు న్యాయం జరగలేదు. ఇక, ఇప్పుడు బాబు పిలుపునిచ్చిన ఏ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనలేదు. తాజాగా ఇసుక దీక్షకు కూడా దూరంగా ఉన్నారు. దీంతో ఆయన కూడా పార్టీ నుంచి జంప్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.