వచ్చే ఎన్నికలను తాను గానీ… తన కుటుంబ సభ్యులు గానీ పోటీ చేయట్లేదని టీడీపీ ఎంపీ మురళీ మోహన్ స్పష్టం చేశారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడిన సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి పోటీ చేయనప్పటికీ.. పార్టీలో కార్యకర్తగా మాత్రం కొనసాగుతానని ఆయన ప్రకటించారు. మా ట్రస్ట్ కార్యకలాపాలు చూసుకోవాల్సి ఉండగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదని ఆయన వివరించారు.
అయితే… ఈ విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి కూడా మురళీ మోహన్ తీసుకెళ్లారట. తనకు ఎంపీగా పోటీ చేయాలన్న ఆసక్తి లేదని చంద్రబాబుకు మురళీ మోహన్ చెప్పినప్పటికీ.. మరోవైపు తనకు ఉన్న డిమాండ్లను చంద్రబాబు ముందుంచినట్లు తెలుస్తోంది.
టీడీపీలో ఈ సమస్య ఒక్క మురళీ మోహన్ తోనే కాదు.. దాదాపు అందరు టీడీపీ ఎంపీలు ఇలాంటి ధోరణితోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వాళ్లు మళ్లీ ఎంపీగా పోటీ చేయడానికి అంత ఆసక్తి చూపించడం లేదు. కాకినాడ ఎంపీ తోట నరసింహం అనారోగ్య కారణాల వల్ల ఈసారి ఎంపీగా పోటీ చేయడం కుదరదంటూ తేల్చారు. ఇంకోవైపు తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఇప్పటికే వైసీపీలో చేరారు. దీంతో అమలాపురం ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థిని వెతికే పనిలో పడ్డాడు బాబు. నిజం చెప్పాలంటే టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదట.
రోజు రోజుకూ ఏపీలో వైఎస్సాఆర్సీపీకి పెరుగుతున్న ఆదరణ, సర్వేలు కూడా వచ్చే ఎన్నికల్లో వైఎస్సాఆర్సీపీ గెలుస్తుందని కన్ఫర్మ్ చేయడం, టీడీపీకి చెందిన చాలామంది వైఎస్సాఆర్సీపీలో చేరడం.. ఇవన్నీ చూసి టీడీపీ ఖచ్చితంగా ఓడిపోతుందన్న భయంతోనే చాలామంది పోటీకి దూరమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మురళీ మోహన్ కూడా ఓడిపోతాననే భయంతోనే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.